అమరావతి : చెత్తా చెదారం లేకుండా పర్యావరణం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కృష్ణాజిల్లా గుడివాడలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రతి మూడో శనివారం స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని అన్నారు.18వ స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని గుడివాడలో నిర్వహిస్తున్నాం.
ఎన్టీఆర్ తొలిసారి ప్రజాక్షేత్రంలో నిలబడిన ప్రాంతం ఇది అని గుర్తు చేశారు సీఎం. స్వచ్ఛమైన రాజకీయాలు, స్వచ్చమైన ప్రజా ప్రతినిధులు, స్వాభిమానం అనే అంశాలపై ఎన్టీఆర్ పార్టీ పెట్టారని చెప్పారు. గతంలో స్వార్ధ రాజకీయాలు మాత్రమే ఉన్న పరిస్థితిని మార్చి అభివృద్ధి, సంక్షేమాన్ని తీసుకు వచ్్చారని తెలిపారు సీఎం. అర్హులందరికీ సంక్షేమం, రాష్ట్రంలో అభివృద్ధి, ఉపాధి ఉద్యోగాలు, సంపద వచ్చేలా పాలన అందిస్తున్నాం అన్నారు.
పరిశుభ్రత అంటే రోడ్లు ఊడ్చటం ఒక్కటే కాదని గుర్తు పెట్టుకోవాలని అన్నారు ముఖ్యమంత్రి. పర్యావరణం, ప్రజల ఆరోగ్యం మెరుగ్గా ఉండాలని స్పష్టం చేశారు. గత పాలనలో చెత్తాచెదారం నింపేసిన ఈ ప్రాంతాన్ని ఇప్పుడు పరిశుభ్రంగా తీర్చిదిద్దాం అని పేర్కొన్నారు. మన జన్మ స్థలాన్ని చెత్తలేకుండా పరిశుభ్రంగా ఉంచాలన్న ఆలోచనతో మనం పనిచేయాలని పిలుపునిచ్చారు నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వానికి ప్రజలు సహకరిస్తేనే స్వచ్ఛతా లక్ష్యం సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. పచ్చదనం, పరిశుభ్రత ఉంటేనే మన లక్ష్యాన్ని సాధించగలం అన్నారు. శాంతి భద్రతలు, సంక్షేమం, ఆదాయంతో మెరుగైన జీవన ప్రమాణాలు ప్రజలకు ఉండాలనే దిశగా కృషి చేస్తున్నామన్నారు.
















