ముంబై : 33 శాతం మహిళా కోటాను అమలు చేయాలని ఎన్‌సీపీ (ఎస్‌పీ) ఎంపీ సుప్రియా సూలే డిమాండ్ చేశారు. దానిని నియోజకవర్గాల పునర్విభజనతో ముడి పెట్టవద్దన్నారు. మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని ఇండియా కూటమి నిరంతరం డిమాండ్ చేస్తోందని, బిల్లు ప్రవేశపెట్టిన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజనపై తమ వైఖరిని నిర్ణయిస్తామని ఎంపీ సుప్రియా సూలే పేర్కొన్నారు. పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే అంశాన్ని నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో ముడి పెట్టకుండా అమలు చేయాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం ఆమె ముంబైలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని, దీనిని పునర్విభజన ప్రక్రియతో ముడి పెట్టాలని ఇండియా కూటమి ఎప్పుడూ డిమాండ్ చేయలేదని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియకు సంబంధించి తమ పార్టీ (ఎన్‌సీపీ-ఎస్‌పీ) ఎవరితోనూ ఎలాంటి చర్చలు జరపలేదని ఆమె తెలిపారు. మేము పునర్విభజన గురించి ఎవరితోనూ చర్చలు జరపలేదు, ఎవరూ మమ్మల్ని సంప్రదించ లేదని పేర్కొన్నారు సుప్రియా సూలే. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాతే మేము మా వైఖరిని ఖరారు చేస్తామని ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఇటువంటి చట్టంపై ఇండియా కూటమితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని బారామతి ఎంపీ తెలిపారు. అయితే, రాబోయే ఏదైనా బిల్లుపై తాము ఇండియా కూటమిలో కూలంకషంగా చర్చిస్తామన్నారు. గతంలో డీఎంకే, ఎస్‌పీ, మా పార్టీలు 50 శాతం కోటా అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటామని ఇప్పటికే స్పష్ట చేశామన్నారు.

















