న్యూఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. కేంద్ర సర్కార్ నిర్వాకంపై మండిపడ్డారు. యూపీలోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం విరాళాలలో చోటు చేసుకున్న కుంభకోణంపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సందర్బంగా విచారణ జరిపించాలని ఖర్గే, రాహుల్ డిమాండ్ చేశారు. ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’ విరాళాలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై స్వతంత్ర విచారణ జరపాలని కాంగ్రెస్ నేతలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కష్టపడి సంపాదించిన డబ్బును భక్తితో విరాళంగా ఇచ్చిన లక్షలాది మంది భక్తులు ఈ “దొంగతనం” వల్ల తాము మోస పోయామని భావిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రధాని మౌనం వహించడం ఆమోద యోగ్యం కాదని, బాధ్యతను నిర్ధారించి, నష్టాన్ని సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని పార్లమెంటు ఉభయ సభల్లోని ప్రతిపక్ష నేతలు కోరారు.
రామమందిరానికి సమర్పించిన విరాళాల దొంగతనం వ్యవహారం జూన్ మొదటి వారంలో వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేయగా, ట్రస్ట్‌కు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు రాజీనామా చేశారు. జూన్ 25న, ట్రస్ట్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ఎనిమిది మందిని అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పార్లమెంటులో ట్రస్ట్ ఏర్పాటును ప్రధాని ప్రకటించారని, అయితే దాని సభ్యులను మాత్రం ఆయన ప్రభుత్వమే నియమించిందని గాంధీ , ఖర్గే తమ లేఖలో పేర్కొన్నారు. ట్రస్ట్ సభ్యులు ఆర్‌ఎస్‌ఎస్ , వీహెచ్‌పీ , వాటి అనుబంధ సంస్థలతో సంబంధం కలిగి ఉన్నారన్న విషయం బహిరంగ రహస్యమని, ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి కూడా ప్రధానికి సన్నిహితుడేనని కాంగ్రెస్ నేతలు గుర్తు చేశారు.

















