అమరావతి : రాష్ట్రంలో మహిళల రక్షణ, భద్రతకే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం పరిధిలోని రాజయ్యపేట, నక్కపల్లి ఆటో స్టాండ్లలో ఆటో డ్రైవర్లకు మహిళా భద్రత లక్ష్యంగా రూపొందించిన ‘అభయ’ కార్యక్రమంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హోం మంత్రి స్వయంగా ఆటోలు, ఆర్టీసీ బస్సులకు ‘అభయ’ భద్రతా స్టిక్కర్లను అంటించారు. అనంతరం నక్కపల్లి వద్ద ఆర్టీసీ బస్సును తనిఖీ చేసి, ప్రయాణిస్తున్న మహిళలతో మాట్లాడి ‘అభయ’ రక్షణ వ్యవస్థ పనితీరు, ఆపత్కాలంలో పోలీసుల సహాయం పొందే విధానంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ సమాజంలో మహిళలు నిర్భయంగా, ఆత్మ గౌరవంతో జీవించేలా పూర్తి స్థాయి రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. మహిళల రక్షణలో ఆటో డ్రైవర్లు, ప్రజా రవాణా సిబ్బంది కీలక పాత్ర పోషించాలని అన్నారు అనిత వంగలపూడి. అనుమానాస్పద పరిస్థితులు, ఆపదలు ఎదురైనప్పుడు మహిళలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం మహిళా భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని నొక్కి చెప్పారు. బాధితులు వెంటనే పోలీసులను సంప్రదించేలా ‘అభయ’ కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయి వరకు పూర్తి భరోసా కల్పిస్తున్నాం అని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు, నక్కపల్లి సీఐ మురళి, ఎస్సై సన్నీబాబు, ఇతర పోలీసు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు , పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు, ప్రజలు పాల్గొన్నారు.

















