బెర్లిన్ : భారత దేశంలో తయారీ రంగానికి, ఆవిష్కరణలకు జర్మన్ సంస్థలకు అపారమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు కేంద్ర వ్యాపార, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్. జర్మనీ ఫెడరల్ ఆర్థిక వ్యవహారాలు , ఇంధన శాఖ మంత్రి కేథరీనా రీచెతో కలిసి జర్మన్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ ఇండియా సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడారు. బెర్లిన్‌లో పలువురు అగ్రశ్రేణి వ్యాపార నాయకులతో ఫలవంతమైన సమావేశాలు జరిపినట్లు తెలిపారు, ఈ సమావేశాలలో భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి, తయారీకి, ఆవిష్కరణలు చేయడానికి జర్మన్ కంపెనీలకు ఉన్న అపారమైన అవకాశాలను ఆయన హైలైట్ చేశారు. విశ్వాసం, పోటీతత్వం , పరస్పర పూరక బలాలపై ఆధారపడిన శక్తివంతమైన ఆర్థిక భాగస్వామ్యాన్ని నిర్మించు కోవడానికి భారతదేశం , యూరోపియన్ యూనియన్ కి అవకాశం ఉందని మంత్రి నొక్కి చెప్పారు.
బేయర్ ఫార్మాస్యూటికల్స్ డివిజన్ ప్రెసిడెంట్ స్టీఫన్ ఓల్రిచ్తో సమావేశమయ్యారు. భారతదేశంలో బేయర్ విస్తరణ ప్రణాళికలు, అలాగే అధిక పెట్టుబడి, ఆవిష్కరణలు, సహకారం ద్వారా మన పటిష్టమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించుకునే అవకాశాలపై చర్చించినట్లు తెలిపారు పీయూష్ గోయల్. ఫ్రెసేనియస్ గ్రూప్ సీఈఓ మైఖేల్ సేన్‌తో జరిగిన సమావేశంలో భారతదేశం వేగంగా విస్తరిస్తున్న ఆరోగ్య సంరక్షణ రంగం, నాణ్యమైన, సరసమైన వైద్య పరిష్కారాలకు పెరుగుతున్న డిమాండ్, బలమైన తయారీ సామర్థ్యాలను ఉపయోగించుకొని, ఆరోగ్య సంరక్షణ రంగంలో సహకారాన్ని మరింతగా పెంపొందించుకునే అవకాశాలపై చర్చించడం జరిగిందన్నారు. నైపుణ్యం కలిగిన ప్రతిభను , ప్రపంచ స్థాయి ఉత్పత్తి సామర్థ్యాలను ఎలా ఉపయోగించుకోగలదో అన్వేషించడం జరిగిందన్నారు పీయూష్ గోయల్.
















