TTD : తిరుపతి – తిరుపతి లోని శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో సెప్టెంబరు 3 నుండి 5వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు సెప్టెంబరు 2వ తేదీ సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం ఆచార్య రుత్విక్‌వరణంలో భాగంగా ఋత్వికులకు విధులు కేటాయించి వస్త్ర సమర్పణ చేస్తారు. సాయంత్రం ఆలయ విమాన ప్రాకారం చుట్టూ సేనాధిపతి వారిని ఊరేగింపు నిర్వహించి, ఆ తరువాత యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
TTD Pavitrotsavam Updates
పవిత్రోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 3న ఉదయం పవిత్ర ప్రతిష్ట, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సెప్టెంబరు 4న మూలవర్లకు, ఉత్సవర్లకు, విమాన ప్రాకారానికి, ధ్వజ స్తంభానికి, మాడ వీధుల్లోని శ్రీమఠం ఆంజనేయ స్వామి వారికి పవిత్రాలు సమర్పిస్తారు. సెప్టెంబరు 5న పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. ఈ మూడు రోజుల పాటు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు టీటీడీ (TTD) ఈవో జె. శ్యామల రావు. ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా స్వామి వారి ట్రస్టులకు భారీ ఎత్తున విరాళాలు అందుతున్నాయి. ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూప్ కు చెందిన ఎక్స్ ప్రెస్ ఇన్ ఫ్రా ఎండీ కవిత సింఘానియా శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళం అందించారు. ఈ మేరకు దాత ప్రతినిధులు జాన్ మని, బొమ్మల మురళీలు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
Also Read : ED Shocking – MLA KC Veerendra Arrest : కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర అరెస్టు
