శ్రీ కోదండరాముడి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు

అప్పలాయగుంట బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక వైభవం

hellotelugu-HanumathaVahanam

తిరుప‌తి : అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభోపేతంగా కొన‌సాగుతున్నాయి. శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారు హనుమంత వాహనంపై శ్రీ కోదండరామ అలంకారంలో దివ్య మంగళ విహారం చేస్తూ భక్తులకు అభయ ప్రదానమిచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహనసేవలో భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ, శ్రీరామ నామస్మరణల మధ్య స్వామివారి దివ్యరూపాన్ని దర్శించుకుని పులకించిపోయారు. హనుమంతునిపై శ్రీ కోదండరాముని అలంకారంలో స్వామివారి దర్శనం భక్తులకు అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది.

మధ్యాహ్నం 3.00 నుంచి 4.00 గంటల వరకు పుణ్యాహ వాచనం, వసంతోత్సవం నిర్వహించారు.
రాత్రి గజ వాహనంపై దివ్య దర్శనం ఇచ్చారు భ‌క్తుల‌కు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి 7 గంటలకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారు గజ వాహనంపై భక్తులకు దివ్య దర్శన భాగ్యం క‌ల్పించారు. ఇదిలా ఉండ‌గా శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర స్వామి బ్ర‌హ్మోత్సవాల‌ను పుర‌స్క‌రించుకుని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వ‌చ్చే భ‌క్త బాంధ‌వుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయ‌డంతో సంతోషం వ్య‌క్తం చేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Exit mobile version