తిరుపతి : విద్యుత్ పరిరక్షణ, వనరుల సద్వినియోగం, స్వయం సమృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా టిటిడి పరిపాలనా భవనంతో పాటు అన్ని టిటిడి కార్యాలయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రుల్లో విద్యుత్ వినియోగాన్ని సమర్థవంతంగా నియంత్రించేందుకు ప్రయత్నం చేయాలని టిటిడి ఈవో ముద్దాడ రవి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వనరుల పరిరక్షణ మార్గదర్శకాలు, టిటిడి ముఖ్య ఇంజినీర్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు అన్ని విభాగాధిపతులు, కార్యాలయాల అధిపతులు ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని సూచించారు.
అవసరం లేని సమయంలో లైట్లు, ఫ్యాన్లు, ఎయిర్ కండిషనర్లు, కంప్యూటర్లు, ప్రింటర్లు తదితర విద్యుత్ పరికరాలను తప్పనిసరిగా నిలిపి వేయాలని స్పష్టం చేశారు. కార్యాలయాల్లో ఎయిర్ కండిషనర్లను ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు మాత్రమే వినియోగించాలని, సెలవు రోజుల్లో ప్రత్యేక అనుమతి లేకుండా ఏసీలను వినియోగించరాదని ఆదేశించారు. అలాగే ఎయిర్ కండిషనర్ల విద్యుత్ సరఫరాను విద్యుత్ విభాగం కేంద్ర స్థాయి నుంచి నియంత్రించనుందని పేర్కొన్నారు ఈవో.
విద్యుత్ స్విచ్ బోర్డులకు గుర్తింపు సంఖ్యలు ఏర్పాటు చేయడం, విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించే సందేశాలను ప్రధాన ప్రదేశాల్లో ప్రదర్శించడం, అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించడం, ప్రతి నెల విద్యుత్ వినియోగం, విద్యుత్ బిల్లుల వివరాలను గత ఏడాది ఇదే నెలతో పోల్చి ప్రదర్శించడం ద్వారా ఉద్యోగుల్లో విద్యుత్ పొదుపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈవో ఆదేశించారు. విద్యుత్ పొదుపే వనరుల పరిరక్షణకు తొలి అడుగు అనే లక్ష్యంతో టిటిడిలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించి, విద్యుత్ వ్యయాన్ని గణనీయంగా ఆదా చేసేందుకు అధికారులు, ఉద్యోగులందరూ పూర్తి సహకారం అందించాలని కోరారు. తనిఖీల్లో నిర్లక్ష్యం లేదా నిబంధనల ఉల్లంఘన గుర్తిస్తే తీవ్రంగా పరిగణించి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
