TTD : తిరుమల : తిరుమలలో త్వరలో నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు టీటీడీ (TTD) ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ఈవోగా రెండోసారి ఆయన కొలువు తీరారు. ఈ సందర్భంగా తిరుమలలోని అన్నమయ్య భవనంలో కీలక సమావేశం నిర్వహించారు. ఉన్నతాధికారులకు దిశా నిర్దేశం చేశారు. కాలినడకన తిరుమల వస్తుంటే చాలా మంది భక్తులు టిటిడిలో అందుతున్న సేవలపై సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. అలాగే, భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలుచాలా రుచికరంగా, నాణ్యంగా ఉన్నట్లు భక్తులు చెప్పారన్నారు. తక్షణం చేపట్టే అభివృద్ధి పనులు, దీర్ఘకాలికంగా చేపట్టనున్న పనులపై కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. భక్తులకు అందించేసేవలతో పాటు, విధాన పరమైన నిర్ణయాలలో టిటిడి ఉన్నతాధికారులు, ఉద్యోగులు సమిష్టిగా నిర్ణయం తీసుకుని భక్తులకు వేగంగా, నాణ్యంగా సేవలు అందిద్దామన్నారు.
TTD New EO Key Comments
ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, తిరుమలలో వసతి, అన్నప్రసాదాలు, డొనేషన్ తదితర శాఖలలో విధాన పరమైన వ్యవస్థలను తీసుకు వచ్చామని, దశల వారీగా టిటిడిలోని (TTD) అన్ని శాఖలలో ఇదే విధానాన్ని తీసుకువచ్చి వ్యవస్థలను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈవోకు నివేదించారు. జేఈవో వి. వీరబ్రహ్మం మాట్లాడుతూ స్థానిక ఆలయాలలో మరింతగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. హింధూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా సనాతన ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేసేందుకు పలు కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. టిటిడి స్థానిక ఆలయాలను 14 జోన్ లుగా విభజించి, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కార్యాచరణ చేపట్టామన్నారు.
సివిఎస్వో మురళీకృష్ణ మాట్లాడుతూ, అలిపిరి టోల్ గేట్ వద్ద ఆధునికరించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. భక్తులు మోసాలకు గురికాకుండా ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నామని, అదే సమయంలో సైబర్ ల్యాబ్ ను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. మొదటగా ఉన్నతాధికారులు అందరూ తమ శాఖలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను టిటిడి ఈవోకు వివరించారు. ఈ కార్యక్రమంలో టిటిడిలోని పలు శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read : Hero Rajinikanth Coolie OTT : ఓటీటీలో రజనీకాంత్ కూలీ రెడీ
