తిరుమల : వేసవి సెలవులు తగ్గినప్పటికీ శ్రీవారి భక్తుల రాక మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దీంతో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసినప్పటికీ దర్శన భాగ్యం కష్టతరంగా మారుతోంది. ఈ తరుణంలో శ్రీవారి భక్తులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. నిన్న ఒక్క రోజే 82 వేల మందికి పైగా శ్రీవారిని దర్శించుకున్నారు భక్తులు. బుధవారం కూడా భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ప్రతి రోజూ భక్తుల కోసం ఇచ్చే ఎస్ఎస్ డీ టోకెన్లను రద్దు చేయాల్సి వచ్చిందని స్పష్టం చేసింది టీటీడీ. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. వరుసగా నాలుగవ వారం కూడా ఈ రద్దు జరగడంతో దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు ఇవాళ దర్శనం కోసం కేటాయించిన 10,000 టోకెన్ల కోటా కేవలం గంట వ్యవధిలోనే పూర్తయింది.
భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో తిరుపతిలోని మూడు కేంద్రాలలో సర్వ దర్శనం టోకెన్ల జారీని టిటీడీ రద్దు చేసింది. శుక్రవారం దర్శనం కోసం టోకెన్లు గురువారం మధ్యాహ్నం నుండి యథావిధిగా జారీ చేయనున్నట్లు తెలిపింది. సర్వ దర్శనం టోకెన్లు జారీ చేయక పోవడంపై భక్తులు టీటీడీని తీవ్రంగా విమర్శించారు. సమయం , డబ్బు వెచ్చించి సుదూర ప్రయాణం చేసి వచ్చిన భక్తులను అనవసర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు పేర్కొన్నారు. బుధవారం దర్శనం కోసం టీటీడీ మంగళవారం ఉదయం 5 గంటల నుండి 10,000 సమయ-నిర్దిష్ట ఎస్ ఎస్ డి టోకెన్లను జారీ చేసింది. శ్రీవారి మెట్టు నడక మార్గం ద్వారా తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులకు మరో 2,000 టోకెన్లు జారీ చేశారు. ఈ కోటా గంట వ్యవధిలోనే పూర్తవడంతో, అప్పటికే క్యూలో వేచి ఉన్న భక్తులు, ఆలస్యంగా వచ్చిన వారు టోకెన్ పంపిణీ కేంద్రాల వద్ద ఇబ్బందులు ఎదుర్కొన్నారు.



















