తిరుపతి జిల్లా : ప్రముఖ వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ అలియాస్ విజయ్ కుమార్ నాయుడు తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 77 ఏళ్లు. చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు , వైద్యులు ధ్రువీకరించారు. కల్కి భగవాన్ అసలు పేరు విజయ్ కుమార్ నాయుడు. కల్కి భగవాన్ గా అవతారం ఎత్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక కేంద్రాలు నిర్వహించారు. భారీ ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. . తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన గత పది రోజులుగా చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ట్రస్టు ప్రతినిధి ప్రకటించారు.
ఆధ్యాత్మిక గురువుగా గుర్తింపు పొందిన విజయకుమార్ నాయుడు భక్తులకు ఆధ్యాత్మిక సాధన, మానవతా విలువలు, సేవాభావంపై బోధనలు చేశారు. అదే స్థాయిలో వివాదాలకు కూడా కారణమయ్యారు. ఆయన మృతితో భక్తులు, అనుచరుల్లో విషాదం నెలకొంది. ఆయన పార్థివదేహాన్ని తిరుపతిలోని ఏకం క్షేత్రంలో భక్తుల సందర్శనార్థం ఉంచనున్నట్లు ట్రస్టు ప్రతినిధి తెలిపారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇక కల్కి భగవాన్ విజయ్ కుమార్ నాయుడు భార్య పద్మావతి. భక్తులలో అమ్మ భగవాన్ గా ప్రసిద్ది చెందారు.
ఇక విజయ్‌కుమార్ నాయుడు మొదట ఎల్ ఐసీలో క్లర్క్‌గా పని చేశారు. 1984లో చిత్తూరు ప్రాంతంలో జీవాశ్రమ్ అనే రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించడంలో భాగస్వామి అయ్యారు. అనంతరం ఆయన ఆధ్యాత్మిక బోధనలు ప్రారంభించారు. 1989 ప్రాంతంలో ఆయన అనుచరులు ఆయనను కల్కిగా భావించడం ప్రారంభించారు. తరువాత ఆయనతో అనుబంధంగా వన్ నెస్ అనే ఆధ్యాత్మిక ఉద్యమం విస్తరించింది. ఆ ఉద్యమంలో ధ్యానం, చైతన్యం అనే భావనలకు ప్రాధాన్యం ఇచ్చారు.



















