జార్ఖండ్ : ఈడీ రంగంలోకి దిగింది. ఏకంగా రూ. 734 కోట్ల జీఎస్టీ కుంభకోణం కేసులో జార్ఖండ్ వ్యాపారి, ఆయన కుమారుడిని అరెస్టు చేసింది. జార్ఖండ్‌కు చెందిన వ్యాపారి జ్ఞాన్‌చంద్ జైస్వాల్ , ఆయన కుమారుడు రాజ్ జైస్వాల్‌లను అరెస్టు చేసింది. నకిలీ ఇన్‌వాయిస్‌లు, షెల్ కంపెనీలు , తప్పుడు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ క్లెయిమ్‌లతో కూడిన సుమారు రూ. 734 కోట్ల జీఎస్టీ మోసానికి సంబంధించి ఈ అరెస్టులు జరిగినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. జంషెడ్‌పూర్, ఆదిత్యపూర్, గంహరియా , కోల్‌కతాలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన అనంతరం నిన్న అర్ధరాత్రి వీరిద్దరినీ ఈడీ అదుపులోకి తీసుకుంది. వైద్య పరీక్షల అనంతరం వీరిని రాంచీకి తరలించింది. వీరిని ఈ రోజు కోర్టులో హాజరు పరచనున్నట్లు పేర్కొన్నారు. వస్తువుల కొనుగోలు లేదా అమ్మకం జరగకుండానే, కేవలం నకిలీ ఇన్‌వాయిస్‌లను ఉపయోగించి ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ పొందడం ఈ కేసులో ప్రధాన అంశమని ఈడీ తెలిపింది.
షెల్ కంపెనీల ద్వారా జరిగిన లావాదేవీలు , వాటికి సంబంధించిన నగదు ప్రవాహంపై కూడా ఏజెన్సీ దర్యాప్తు చేస్తోందని స్పష్టం చేసింది. ఈ ఆపరేషన్‌లో జ్ఞాన్‌చంద్ జైస్వాల్‌కు సంబంధించిన ప్రాంగణాలతో పాటు ఆయన ఆడిటర్ సంజయ్ పరేఖ్ , ఇతర వ్యక్తులకు చెందిన ప్రదేశాలలో కూడా ఈడీ సోదాలు నిర్వహించినట్లు పేర్కొంది. వ్యాపార పత్రాలు, జీఎస్టీ సంబంధిత రికార్డులు, బ్యాంకింగ్ , ఆర్థిక లావాదేవీల పత్రాలు అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలను దర్యాప్తు బృందం పరిశీలించిందని వెల్లడించింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై కోల్‌కతా రియల్ ఎస్టేట్ డైరెక్టర్‌ను అరెస్టు చేసినట్లు తెలిపింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ ఈ చర్య తీసుకుందని పేర్కొంది. షెల్ కంపెనీలు , కేవలం కాగితాలకే పరిమితమైన లావాదేవీల ద్వారా భారీ స్థాయిలో టీటీసీ దుర్వినియోగం జరిగిందని దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. ఈ కేసుపై ప్రాథమిక దర్యాప్తును జంషెడ్‌పూర్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ నిర్వహించింది.


















