విజయవాడ : బెజవాడ ఎంపీ కేశినేని చిన్ని కీలక ప్రకటన చేశారు. రాబోయే దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దసరా దేవీ నవరాత్రుల సందర్భంగా విజయవాడలో భక్తులు, పర్యాటకులు, కళాభిమానులను ఆకట్టుకునేలా విజయవాడ ఉత్సవ్, జాతీయ సరస్సు మేళను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.విజయవాడలో ఎంపీ మీడియాతో మాట్లాడారు. దసరా ఉత్సవాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు విజయవాడకు తరలి వస్తారని, దుర్గమ్మ ఆశీస్సులతో విజయవాడ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గత ఏడాది విజయవాడ ఉత్సవ్‌ను వైభవంగా నిర్వహించామని, ఉప రాష్ట్రపతి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా లక్షలాది మంది ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. ప్రజల సహకారంతో గత ఏడాది ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించామని చెప్పారు.
ఈ ఏడాది దేవీ నవరాత్రుల సందర్భంగా అక్టోబర్ 11 నుంచి 20 వరకు విజయవాడ ఉత్సవ్ నిర్వహించనున్నట్లు ఎంపీ చిన్ని వెల్లడించారు. అదే సమయంలో అక్టోబర్ 8 నుంచి 23 వరకు జాతీయ సరస్సు మేళ కొనసాగుతుందని తెలిపారు. విజయవాడలోని 18 ఎకరాల పున్నమి ఘాట్ పరిధిలో సరస్సు మేళ, విజయవాడ ఉత్సవ్‌లను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలోనూ పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విజయవాడను సాంస్కృతిక, కళల రాజధానిగా మరోసారి చాటి చెప్పేలా ఈ ఉత్సవాలను నిర్వహించ నున్నామని ఎంపీ చిన్ని తెలిపారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నామని, ఆయా రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
సరస్సు మేళ, విజయవాడ ఉత్సవ్, అమ్మవారి దర్శనం.. ఈ మూడు కార్యక్రమాలను ఒకే పర్యటనలో ఆస్వాదించేలా అతిథులు, సందర్శకుల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఉదయం కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని, సాయంత్రం విజయవాడ ఉత్సవ్, సరస్సు మేళలో పాల్గొనేలా ప్రజలు తమ రెండు రోజుల షెడ్యూల్‌ను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ఎంపీ చిన్ని విజ్ఞప్తి చేశారు. విజయవాడ ఉత్సవ్‌లో పది రోజుల పాటు వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారుల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రుచికరమైన వివిధ ప్రాంతాల వంటకాలతో ప్రత్యేక ఫుడ్ ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మైసూరు ఏనుగులను విజయవాడకు తీసుకువచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని వెల్లడించారు.



















