విశాఖపట్నం జిల్లా : సింహాచలం గిరి ప్రదక్షిణ కోసం భక్తుల రద్దీ, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు దిగువ ప్రాంతాల్లో 70 తాత్కాలిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి అపిత వంగలపూడి తెలిపారు. కొండపై ఇప్పటికే ఉన్న శాశ్వత సీసీ కెమెరాలకు అదనంగా 45 తాత్కాలిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. భద్రతా విధుల కోసం పోలీస్ శాఖకు చెందిన 2,700 మంది సిబ్బందిని మోహరిస్తున్నట్లు, వివిధ శాఖలకు చెందిన మొత్తం 5 వేల మంది సిబ్బంది సేవలందించనున్నట్లు చెప్పారు. మార్గమంతటా 40 పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్, తగినంత లైటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అగ్ని ప్రమాదాల నివారణకు పైకొండ, దిగువకొండ ప్రాంతాల్లో మొత్తం 192 అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుతున్నట్లు వివరించారు. పిల్లలు, వృద్ధులు తప్పిపోకుండా ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగింగ్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.
భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు వివరించారు. హనుమంతవాక, వెంకోజిపాలెం ప్రాంతాల్లో జాతీయ రహదారి దాటే భక్తుల సంఖ్య అధికంగా ఉండటంతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ నెల 28న ఉదయం 7 గంటల నుంచి 29వ తేదీ మధ్యాహ్నం వరకు హనుమంతవాక, శొంఠ్యాం, వేపగుంట, గోపాలపట్నం వైపుల నుంచి సింహాచలం వైపు వచ్చే లారీలు, ఇతర భారీ వాహనాల రాకపోకలను నియంత్రించనున్నట్లు తెలిపారు. శొంఠ్యాం వైపు నుంచి వచ్చే బస్సులను అడవివరం జంక్షన్ వద్ద నిలిపివేస్తామని, ప్రహ్లాదపురం వైపు నుంచి వచ్చే బస్సులను పెట్రోల్ బంక్ నుంచి వేపగుంట వైపు మళ్లిస్తామని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను ఆనందపురం నుంచి సబ్బవరం వైపు మళ్లించనున్నట్లు తెలిపారు. నగరంలోకి వచ్చే వాహనాలు అనకాపల్లి హైవే, లంకెలపాలెం మీదుగా చేరుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ద్విచక్ర వాహనాలు, కార్లు అసకపల్లి వద్ద నుంచి నరవ రహదారి మీదుగా నగరంలోకి వెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. నగరం నుంచి బయటకు వెళ్లే వాహనాలు షీలానగర్, గాజువాక, లంకెలపాలెం, అనకాపల్లి హైవే మీదుగా వెళ్లాలని సూచించారు.



















