Pulichintala Project : పల్నాడు జిల్లా – ఏపీలో ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ నుంచి వరద ఉధృతి పెరుగుతుండడంతో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. తాజాగా పల్నాడు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. దీంతో వరద హెచ్చరికను జారీ చేశారు ప్రాజెక్టు అధికారులు. ఈ మేరకు నోట్ విడుదల చేశారు. పులిచింతల ప్రాజెక్టు రిజర్వాయర్ ప్రస్తుత నీటి మట్టం 52.82 మీ (173.29 అడుగులు)లకు చేరుకుంది. నిల్వ సామర్థ్యం 43.158 టీఎంసీలు ఉండగా పూర్తి రిజర్వాయర్ సామర్థ్యం 45.77 టీఎంసీలుగా ఉంది. పూర్తి రిజర్వాయర్ సామర్థ్యం 53.34 మీ (175.00 అడుగులు) ఉండగా నాగార్జున సాగర్ టెయిల్‌పాండ్ నుండి వచ్చే నీటి ప్రవాహం దాదాపు 1,62,000 క్యూసెక్కులకు చేరుకుంది. ప్రాజెక్ట్ ఆనకట్ట నుండి వచ్చే నీటి ప్రవాహం దాదాపు 1,57,000 క్యూసెక్కులుగా ఉంది.
Pulichintala Project in Danger Level
పులిచింతల ప్రాజెక్ట్ (Pulichintala Project) త్వరలో పూర్తి రిజర్వాయర్ స్థాయి (FRL)ని చేరుకోవచ్చని ధ్రువీకరించారు అధికారులు. ప్రాజెక్ట్ నుండి దాదాపు 2,00,000 క్యూసెక్కులు నీరు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఎగువ నుండి వచ్చే ప్రవాహాలను బట్టి నీటిని వదులుతామని, చుట్టు పక్కల, పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రస్తుతం 2,50,000 క్యూసెక్కులకు చేరుకుందని తెలిపారు. ఇదిలా ఉండగా ఆనకట్ట ఎగువ, దిగువన ఉన్న కృష్ణా నదిని ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు, సంబంధిత అధికారులందరికీ అలర్ట్ గా ఉండాలని స్పష్టం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు.
Also Read : AP Chairman Posts Exclusive : ఏపీలో నామినేటెడ్ పదవుల పందేరం
