బెంగళూరు : రాజకీయాల కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యం అని స్పష్టం చేశారు ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో సీఎం డీకే శివకుమార్ . తమిళనాడు రాష్ట్రంతో కావేరీ నీటి పంపిణీ వివాదంపై రాష్ట్ర చట్ట పరమైన , రాజకీయ వ్యూహాన్ని ఖరారు చేసేందుకు, 15 రోజుల పాటు రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న సీడబ్ల్యూఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బెంగళూరులోని తన అధికారిక నివాసం ‘కృష్ణ’లో అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించారు. కావేరీ నీటి సమస్యపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం. రాజకీయాల కంటే రాష్ట్ర రైతులు, ప్రజల ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ప్రమాదంలో పడినప్పుడు రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ఐక్యంగా నిలిచిన చరిత్ర కర్ణాటకకు ఉందని ఆయన పేర్కొన్నారు.
కావేరీ వివాదం కర్ణాటక ప్రజలకు కొత్తేమీ కాదని ముఖ్యమంత్రి అన్నారు. మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ అనారోగ్య కారణాల రీత్యా ఈ సమావేశానికి హాజరు కాలేదు. తమిళనాడుకు 15 రోజుల పాటు రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ జూలై 30న ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా కర్ణాటక అంతటా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ సమావేశం జరగడం విశేషం. తమిళనాడుకు నీటిని విడుదల చేయకూడదని బీజేపీ, రైతు సంఘాలు, కన్నడ అనుకూల వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రులు ఎం వీరప్ప మొయిలీ, సిద్ధరామయ్య, బి ఎస్ యడియూరప్ప, హెచ్ డి కుమారస్వామి, డి వి సదానంద గౌడ , బసవరాజ్ బొమ్మై తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
భారీ వర్షాలతో కర్ణాటకలోని కావేరీ జలాశయాల్లో నీటి కొరత తీరింది. కావేరీ వివాదం మాకు కొత్త కాదు, మీకు కూడా కొత్త కాదు. మనందరి జీవితాల్లో కావేరీ వివాదం ఒక అంతర్భాగంగా ఉంటూనే మనం పెరిగామని పేర్కొన్నారు సీఎం డీకే శివకుమార్. రాష్ట్ర వైఖరిని మరోసారి స్పష్టం చేస్తూ తాగునీటి అవసరాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నదే కర్ణాటక స్థిరమైన విధానమని శివకుమార్ పేర్కొన్నారు.
