హైదరాబాద్ : రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన.. ముందస్తు గుర్తింపు ప్రాధాన్యంపై చైతన్యం.. మహిళల ఆరోగ్య సంరక్షణ, సాధికారతకు మద్దతుగా హైదరాబాద్ పరుగులు తీసింది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్), సుధా రెడ్డి ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన పింక్ పవర్ రన్ 3.0కు స్పందన లభించింది. హుస్సేన్‌సాగర్ తీరంలోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ నుంచి ప్రారంభమైన ఈ మెగా కమ్యూనిటీ రన్‌లో దాదాపు 35 వేల మందికి పైగా పాల్గొన్నారు. తెల్లవారుజామునే నెక్లెస్‌రోడ్ పరిసరాలు రన్నర్లతో కిక్కిరిశాయి. ఆరోగ్యం, ఫిట్‌నెస్, ముందస్తు వైద్య పరీక్షలు, రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం.. హైదరాబాద్‌లో అతిపెద్ద కమ్యూనిటీ ఫిట్‌నెస్ కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది. పింక్ పవర్ రన్‌లో నాలుగు విభాగాల్లో పోటీలు నిర్వహించారు. 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల పరుగులు నిర్వహించారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఐదేళ్ల చిన్నారులతో పాటు 80 ఏళ్లకు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమం స్ఫూర్తిని చాటారు. 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్‌కు అంతర్జాతీయ స్థాయిలో స్పందన లభించింది. అమెరికా, ఇంగ్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, ఉగాండా, శ్రీలంక, ఐస్‌లాండ్, టాంజానియా, బోట్స్వానా, కెన్యా, కెనడా తదితర దేశాల నుంచి రన్నర్లు పాల్గొన్నారు. దేశ, విదేశాలకు చెందిన రన్నర్లతో నెక్లెస్‌రోడ్డుపై అంతర్జాతీయ క్రీడా వాతావరణం నెలకొంది. సినీ నటుడు సిద్దు జొన్నలగడ్డ, మాజీ ప్రపంచ సుందరి ఓపల్ సుచేత, భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్, నారాయణ గ్రూప్ విద్యాసంస్థల డైరెక్టర్ పునీత్, అవినాష్ గ్రూప్ సంస్థల చైర్మన్ అవినాష్ తదితరులు పాల్గొని రన్నర్లలో ఉత్సాహం నింపారు.
పింక్ పవర్ రన్‌లో మహారాష్ట్రకు చెందిన రమాబాయి రణ్‌వీర్ పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బీడ్ జిల్లా అంబాజోగైకి చెందిన 47 ఏళ్ల రమాబాయి.. తన పిల్లల చదువుల కోసం గతంలో చెప్పులు లేకుండా ఐదు కిలోమీటర్లు పరుగెత్తి వార్తల్లో నిలిచారు. ఆమె పింక్ పవర్ రన్‌లో పాల్గొనడం ద్వారా మహిళల పట్టుదల, ఆరోగ్యంపై అవగాహన, సామాజిక బాధ్యతకు ప్రతీకగా నిలిచింది. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు నిర్వాహకులు మొత్తం రూ.75 లక్షల విలువైన నగదు బహుమతులు అందించారు. నగదుతోపాటు మెడల్స్, ట్రోఫీలను నిర్వాహకులు, ముఖ్య అతిధులు అందజేశారు. 21కే హాఫ్ మారథాన్ పురుషుల విభాగంలో సునీల్ కుమార్ ప్రథమ స్థానంలో నిలవగా.. మహిళల విభాగంలో సోనమ్ విజేతగా నిలిచారు. 10కే రన్ పురుషుల విభాగంలో హరీష్ షరీన్ తొలి స్థానాన్ని సాధించగా.. మహిళల విభాగంలో వందన పటేల్ విజేతగా నిలిచారు. 5కే రన్ పురుషుల విభాగంలో లవ్ చౌధరి మొదటి స్థానంలో నిలవగా.. మహిళల విభాగంలో అంజలి విజయం సాధించారు.
















