న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జైరాం రమేష్ నిప్పులు చెరిగారు కేంద్ర ఎన్నికల సంఘం నిర్వాకంపై. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. యువ ఓటర్ల కోసం ప్రత్యేక నమోదు శిబిరాలను ఈసీ ప్రకటించిన నేపథ్యంలో రమేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. మొదటిసారి ఓటు వేయబోయే వారికి ఇబ్బందులు కలిగించేలా ఓటర్ల నమోదు ప్రక్రియలో మార్పులు చేశారని భారత ఎన్నికల సంఘం పై మండిపడ్డారు. ఈ విషయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞనేష్ కుమార్ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ఫారం 6’లో మార్పులు చేయడం ద్వారా కొత్త ఓటర్ల నమోదును ఎన్నికల సంఘం గతంలోనే క్లిష్టతరం చేసిందని ఆరోపించారు. ఆ చర్య స్పష్టంగా చట్టవిరుద్ధం , రాజ్యాంగ విరుద్ధం అని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తుదారుల తల్లిదండ్రులు లేదా తాతామామలు గతంలో జరిగిన ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ ప్రక్రియలో భాగమయ్యారా లేదా అనే వివరాలను కోరే కొత్త విభాగం, మొదటిసారి ఓటు వేయనున్న ‘జెన్-జెడ్’ ఓటర్లకు అడ్డంకిగా మారిందని ఆయన వాదించారు.
అధికారిక నోటిఫికేషన్ లేకుండా సంబంధిత నిబంధనలలో సవరణలు చేయకుండానే ఆన్లైన్ ఫారమ్‌ను మార్చారని జైరాం రమేష్ ఆరోపించారు. యువకులు మొదటిసారి ఓటు వేసేవారు ఎటువంటి ఇబ్బంది లేకుండా నమోదు చేసుకునేలా చూసేందుకు, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఈ మార్పును వ్యతిరేకించారని, దానిని వెనక్కి తీసుకోవాలని కోరారని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాన్ని సుమోటోగా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరారు. సర్ ప్రక్రియ , ఎన్నికల సంఘం పనితీరుపై విస్తృత రాజకీయ వివాదం నడుస్తున్న తరుణంలో కాంగ్రెస్ నేత ఈ వ్యాఖ్యలు చేశారు. సర్ ప్రక్రియకు సంబంధించిన నిర్ణయాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పలు సందర్భాల్లో తమ అభ్యంతరాలను నమోదు చేశారని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ నివేదిక పేర్కొందని తెలిపారు.


















