న్యూఢిల్లీ: ప్రపంచ భాగస్వామ్యాలు , ఎగుమతుల ఆధారిత వృద్ధి ద్వారా భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా నిలబెట్టాలని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఈ ఏడాది 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా భారతదేశం సరైన మార్గంలో ఉందని ఆయన అన్నారు.ఇక్కడ జరిగిన మూడవ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం పెరుగుతున్న ప్రాముఖ్యతను, భారతదేశ తయారీ , ప్రపంచ ఆర్థిక ఆశయాలకు మొబిలిటీ రంగం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
మొబిలిటీ విలువ గొలుసులోని పారిశ్రామిక భాగస్వాములందరూ దేశీయ మార్కెట్కు అతీతంగా ఆలోచించి, ప్రపంచ మార్కెట్లన ఎగుమతి అవకాశాలను అందిపుచ్చుకోవాలని మంత్రి కోరారు. భారతదేశపు భారీ దేశీయ మార్కెట్కు అంతర్జాతీయ మార్కెట్లను జోడించడం ద్వారా వ్యాపారాలు భారీస్థాయి ఉత్పత్తి వల్ల కలిగే ప్రయోజనాలను (ఎకానమీస్ ఆఫ్ స్కేల్) సాధించి, ధరల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా పోటీ పడగలవని గోయల్ అన్నారు. భారతీయ తయారీదారుల సామర్థ్యాలపై విశ్వాసం వ్యక్తం చేశారు. జపాన్, ఐరోపా ఆటోమొబైల్ తయారీదారులకు అలాగే ఏరోస్పేస్, రక్షణ రంగాలకు సరఫరా చేస్తున్న వారికి ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలను అందుకునే సత్తా ఉందని ఆయన అన్నారు.
సాంప్రదాయకంగా వేర్వేరు సమయాల్లో, వేర్వేరు ప్రదేశాల్లో ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించి, ఒకే రకమైన సందర్శకులను ఆకర్షించే మొబిలిటీ పర్యావరణ వ్యవస్థలోని వివిధ విభాగాలను ఈ కార్యక్రమం ఒకచోట చేర్చిందని పీయూష్ గోయల్ ఇంకా పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని, అంచనా వేస్తున్న 10 లక్షల మంది సందర్శకులలో కనీసం 25,000 మంది అంతర్జాతీయ సందర్శకులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని మంత్రి నిర్వాహకులను, పరిశ్రమను కోరారు.



















