హైదరాబాద్ : ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు రాష్ట్ర రెవిన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్.డి.ఓలు , సర్వే శాఖ అధికారులతో సమగ్ర భూ సర్వే (రీ-సర్వే) , గృహ నిర్మాణ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. . క్షేత్రస్థాయిలో పర్యటించాలని, రైతులకు ఈ సర్వే గురించి పూర్తి అవగాహన కల్పించేలా చూడాలన్నారు మంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సర్వే కోసం, ప్రతి మండలానికి రెండు సర్వే బృందాలను , రెండు రోవర్లను కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 708 రోవర్లతో సర్వే కొనసాగుతుండగా మరో వారంలో అదనంగా 40 రోవర్లను అందుబాటులోకి తీసుకు రానున్నామని వెల్లడించారు .
పాలేరు నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకుని అక్కడ ఉన్న మొత్తం 141 రెవెన్యూ గ్రామాల్లో ఈ రీ-సర్వేను నిర్వహిస్తున్నామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి, రెవెన్యూ భూములకు , అటవీ భూములకు మధ్య సరిహద్దులను ఖరారు చేయాలని ఆదేశించారు. నల్గొండ , ఖమ్మం జిల్లా కలెక్టర్లు ఈ సర్వేను నిర్వహిస్తున్న తీరు అభినందనీయం అన్నారు. నిజామాబాద్ జిల్లాలో సర్వే పురోగతిని మరింత మెరుగు పరచాలని సూచించారు. అదేవిధంగా వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న ‘ఇందిరమ్మ ఇళ్ల’ నిర్మాణాలను వేగవంతం చేసేలా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నిర్ణీత గడువులోగా వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు. వరంగల్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్ , హన్మకొండ జిల్లాల్లో ఇందిరమ్మ టవర్ల’ నిర్మాణానికి అవసరమైన భూమిని వెంటనే గుర్తించి, సంబంధిత ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాలన్నారు.

















