హైదరాబాద్ : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణ పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, నిర్దేశిత సమయంలో నిర్మాణాలు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆయా స్కూళ్లలో ల్యాండ్ స్కేపింగ్ ఏర్పాటు, ఇంటీరియర్, డిజిటల్ పరికరాలు, క్రీడా పరికరాలు, కిచెన్ సామగ్రి సేకరణకు సంబంధించి అత్యుత్తమ సంస్థలను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. ఏదశలోనూ నాణ్యతలో రాజీపడొద్దని సూచించారు. క్యూర్ పరిధిలో నిర్మిస్తున్న స్కూళ్ల నిర్మాణ ప్రగతిపైనా ఆరా తీశారు. ఆయా స్కూళ్ల నిర్మాణాలపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా ఎక్కడైనా నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటే వెంటనే ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఐటీఐలను ఏటీసీలుగా అప్డేట్ చేసిన తర్వాత విద్యార్థుల నమోదు పెరగడంతో పాటు వాటిలో శిక్షణ పొందిన వారందరికీ ఉద్యోగాలు లభించాయని సీఎం తెలిపారు. పాలిటెక్నిక్‌ల అప్డేట్కు అవసరమైన నిధుల విడుదలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో శాఖపరమైన ఇబ్బందులు తలెత్తితే వెంటనే తన దృష్టికి తీసుకు రావాలని అధికారులకు సూచించారు. యూనివర్సిటీల్లో అసిస్టెంట్, అసోసియేట్, ఇతర ప్రొఫెసర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. నియామక ప్రక్రియకు సంబంధించిన నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ఈ విషయంలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్, యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

















