తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం ఉదయం శ్రీమలయప్ప స్వామి వారు కోదండరాముని అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. వాహనం ముందు గజ రాజులు గంభీరంగా నడుస్తుండగా, భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళ వాయిద్యాల నడుమ హనుమంత వాహనసేవ భక్తి పారవశ్యంతో వైభవంగా సాగింది. విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ “గోవిందా… గోవిందా…” అంటూ స్వామి వారిని దర్శించుకున్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు ఉదయం శేషాచలాధీశుడు శ్రీరామావతారంలో తన పరమ భక్తుడైన హనుమంతునిపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులలో అగ్రగణ్యుడైన హనుమంతుడు భగవంతునిపై అచంచలమైన భక్తి, సేవాభావం, శరణాగతికి ప్రతిరూపంగా నిలుస్తాడు.గురు శిష్యులైన శ్రీరాముడు, హనుమంతుల దివ్య సంబంధం భక్తి, జ్ఞానం, సేవాతత్వాల సమన్వయాన్ని చాటి చెబుతుంది. హనుమంత వాహనంపై కోదండరాముని దర్శించు కోవడం ద్వారా భక్తులకు భగవద్భక్తి, ధర్మనిష్ఠ, శరణాగతి భావాలు మరింతగా పెంపొందుతాయని ఆధ్యాత్మిక విశ్వాసం.
ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

















