ముంబై : రణబీర్ కపూర్, సాయి పల్లవి నటించిన ‘రామాయణం’ ప్రపంచ వ్యాప్త బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. థియేటర్లలో విడుదలైన కేవలం ఎనిమిది రోజుల్లోనే ఈ చిత్రం ఒక కీలక మైలురాయిని చేరుకుంది. శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1,000 కోట్ల వసూళ్లను దాటేసింది. ఈ విజయంతో, రూ. 1,000 కోట్ల క్లబ్లో చేరిన 11వ భారతీయ చిత్రంగా ‘రామాయణం’ నిలిచింది. అంతే కాకుండా, అతి తక్కువ సమయంలో ఈ మైలురాయిని చేరుకున్న భారతీయ చిత్రాల జాబితాలో ఇది మూడవ స్థానాన్ని దక్కించుకుంది. ‘పఠాన్’, ‘యానిమల్’ వంటి సినిమాల మొత్తం బాక్సాఫీస్ వసూళ్లను ఈ చిత్రం ఇప్పటికే అధిగమించింది. ట్రేడ్ నివేదికల ప్రకారం, ‘రామాయణం’ భారతదేశంలో సుమారు రూ. 675.05 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. దేశీయంగా దీని నికర వసూళ్లు (నెట్ కలెక్షన్స్) రూ. 564.60 కోట్లు దాటాయి.
‘సాక్నిల్క్’ సమాచారం మేరక ఎనిమిదవ రోజున ఈ చిత్రం అన్ని భాషల్లో కలిపి సుమారు రూ. 53.50 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఈ చిత్రం అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. విదేశీ మార్కెట్ల నుంచి సుమారు రూ. 358.50 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఈ వసూళ్లతో సినిమా ప్రపంచవ్యాప్త మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్లు రూ. 1,033.55 కోట్లకు చేరుకున్నాయి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో సాధించిన బలమైన ప్రదర్శన ఈ మైలురాయిని రికార్డు సమయంలో చేరుకోవడానికి దోహద పడింది. ‘పుష్ప 2: ది రూల్’ ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రాలు మాత్రమే దీనికంటే ముందున్నాయి. ఇవి ఏడు రోజుల్లోనే ఈ ఘనతను సాధించినట్లు సమాచారం.
రూ. 1,000 కోట్ల క్లబ్లో చేరడానికి పట్టిన సమయం పరంగా ఈ చిత్రం గతంలో వచ్చిన అనేక ప్రజాదరణ పొందిన బ్లాక్బస్టర్ సినిమాలను వెనక్కి నెట్టింది. వీటిలో 10 రోజుల్లో విడుదలైన బాహుబలి 2: ది కంక్లూజన్, 16 రోజుల్లో ఈ మైలురాయిని చేరుకున్న ఆర్ఆర్ఆర్ 18 రోజుల్లో విడుదలైన జవాన్ ఉన్నాయి.
















