వాషింగ్టన్ : ఎన్విడియా సీఈఓ, సహ-వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ ఇద్దరు మహిళలతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై వచ్చిన నివేదికల నేపథ్యంలో కొత్త వివాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ తాజా పరిణామాలు కంపెనీలో తీవ్ర ఆందోళనలను రేకెత్తించాయని దీంతో కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఇప్పుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఆయన భవిష్యత్తుపై ఆలోచిస్తోందని సమాచారం. మీడియా నివేదికల ప్రకారం హువాంగ్ పదవిపై చర్చించడానికి ఎన్విడియా బోర్డు ఒక ముఖ్యమైన సమావేశానికి సిద్ధమవుతోంది. హువాంగ్ను ఒక విదేశీ గూఢచార సంస్థ లక్ష్యంగా చేసుకుందనే నివేదికలపై స్వతంత్ర దర్యాప్తును కంపెనీ ప్రకటించిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటు చేసుకుంది. అంతకు ముందు బోర్డు ఆయన నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేసింది.
హువాంగ్ , ఎన్విడియా హెల్త్‌కేర్ వైస్ ప్రెసిడెంట్ కిమ్బెర్లీ పావెల్ మధ్య సంబంధం ఉందనే ఆరోపణలపై నివేదికలు వెలువడిన తర్వాత ఈ వివాదం మరో మలుపు తీసుకుంది. ది న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం వీరిద్దరూ ఒక సంబంధంలో ఉన్నారని తెలిసింది. మార్చిలో శాన్ హోసేలోని ఒక హోటల్లో జరిగిన కంపెనీ సమావేశంలో వారిద్దరూ కలిసి ఉన్నట్లు చూపిస్తున్న ఫుటేజ్‌ను కూడా ఆ నివేదిక ప్రస్తావించింది. ఈ తాజా ఆరోపణలను హువాంగ్ గానీ పావెల్ గానీ బహిరంగంగా ధృవీకరించలేదు. సింగపూర్‌కు చెందిన డేటా కంపెనీ మెగాస్పీడ్లో మాజీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన ఆలిస్ హువాంగ్‌కు సంబంధించిన మునుపటి వివాదం తర్వాత ఈ పరిణామం చోటుచే సుకుంది. జెన్సన్ హువాంగ్‌కు ఆమెకు మధ్య వివాహేతర సంబంధం ఉందని మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
ఆలిస్ హువాంగ్‌కు చైనా గూఢచార సంస్థలతో సంబంధాలు ఉండవచ్చని అమెరికా గూఢచార సంస్థలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ విషయం మరింత దృష్టిని ఆకర్షించింది. ఆమె బీజింగ్‌తో సమాచారాన్ని పంచుకున్నారని నివేదికలలో ఆరోపణలు వచ్చాయి, అయితే ఈ ఆరోపణలు స్వతంత్రంగా నిరూపించ బడలేదు. ఈ విషయాన్ని పరిశీలించడానికి ఎన్విడియా బోర్డు స్వతంత్ర డైరెక్టర్లను , బయటి న్యాయ నిపుణులను నియమించింది. తమ రహస్య సమాచారం లేదా అమెరికా జాతీయ భద్రతకు భంగం వాటిల్లిందని నమ్మడానికి తమకు ఎటువంటి కారణం లేదని కంపెనీ పేర్కొంది.
















