తిరుపతి : సనాతన ధర్మ పరిరక్షణలో అర్చకులు కీలక పాత్ర పోషిస్తూ, భక్తికి సంప్రదాయానికి, దేవాలయానికి సమాజానికి మధ్య ఆధ్యాత్మిక వారధులుగా నిలుస్తున్నారని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ పేర్కొన్నారు. టీటీడీ,హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 05 వరకు 15 రోజులపాటు నిర్వహించిన అర్చక శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశం గురువారం తిరుపతిలోని శ్వేత భవన్లో గల శ్రీ వెంగమాంబ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడారు. సమాజంలో అర్చకులకు విశిష్టమైన, గౌరవ ప్రదమైన స్థానం ఉందన్నారు. అర్చకత్వం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, తరతరాలకు ధర్మ సంప్రదాయాలను, ఆధ్యాత్మిక విలువలను అందించే పవిత్రమైన సేవ అని తెలిపారు. క్రమశిక్షణ, నిష్ఠ, భక్తి, సంప్రదాయాల పట్ల అవగాహనతో అర్చకులు సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించాలని కోరారు. భగవంతుని సన్నిధిలో అన్ని వర్గాలకూ సమాన ప్రాధాన్యత ఉందని, అన్ని సామాజిక వర్గాల వారు అర్చకత్వాన్ని స్వీకరించి సనాతన ధర్మ పరిరక్షణలో భాగస్వాములు కావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ప్రతి మనిషిని మరొకరితో పోలికలేని ప్రత్యేక వ్యక్తిత్వం, విభిన్న లక్షణాలతో సృష్టించడం దైవశక్తి గొప్పతనమని, ప్రతి ఒక్కరూ దైవానుగ్రహానికి అర్హులేనని, భగవంతుని కృపకు పాత్రులు కావాలంటే భక్తి, ధర్మాచరణ, సేవాభావంతో జీవించాలని ఆయన సూచించారు.
సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో 5 వేల ఆలయాల నిర్మాణానికి చర్యలు చేపట్టగా, ఇప్పటికే 2 వేల ఆలయాలకు అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు. టీటీడీ అందిస్తున్న ఆర్థిక సహకారం, అర్చక శిక్షణ, ఆలయాల నిర్మాణం తదితర ధార్మిక కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సైతం భక్తిభావం, ఆధ్యాత్మిక చైతన్యం విస్తరిస్తున్నాయని వివరించారు. ఒక అర్చకుడు తయారైతే ఒక తరానికి ధర్మ సేవకుడు అందించినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ మానవాళికి దైవత్వం, ధర్మం, సేవాభావం మార్గదర్శకాలని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన శ్రీ చంటి సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి స్వగ్రామంలో ఆలయ నిర్మాణానికి కృషి చేస్తూ అర్చకత్వాన్ని స్వీకరించడం అభినందనీయమని జేఈవో ప్రశంసించారు. ఇలాంటి యువత మరింత మంది ముందుకొచ్చి అర్చకత్వాన్ని స్వీకరించడం ద్వారా సనాతన ధర్మ సేవలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. టీటీడీ అందిస్తున్న అర్చక శిక్షణను సద్వినియోగం చేసుకుని ధార్మిక సేవలకు అంకితం కావాలని సూచించారు.
అనంతరం 15 రోజుల అర్చక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న అర్చకులకు శ్రీ పద్మావతి అమ్మవారి చిత్రపటాలతో పాటు ఇత్తడి పళ్లెం, గంట, హారతి పాత్ర, పలక, రెండు రాగి గ్లాసులు, ఉద్ధరిణి, ప్రశంసా పత్రాలను అందజేశారు. అలాగే సకల దేవతా కల్యాణ ప్రయోగం, టీటీడీ పంచాంగం, ఆలయ అర్చన – ఆరాధన విధానం తదితర ధార్మిక గ్రంథాలను అందించి, అర్చక సేవలకు అవసరమైన ఆధ్యాత్మిక, పూజా సామగ్రిని అందించారు. అంతకు ముందు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఏఈవో సత్యనారాయణ మాట్లాడుతూ,టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఆదేశాలు, జేఈవోలు డా. ఎ. శరత్, ప్రభల గోపినాథ్ సూచనల మేరకు శ్వేత సహకారంతో 15 రోజులపాటు అర్చక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అర్చకులకు అవసరమైన ధార్మిక, సనాతన ధర్మ అంశాలపై శిక్షణ అందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ తాళ్లూరి విష్ణు, జోనల్ ఇన్చార్జి శ్రీ రెడ్డెప్ప రావు, శ్వేత డైరెక్టర్ డా. వేమా వేంకటరత్నం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ అదనపు కార్యదర్శి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.


















