హైదరాబాద్ : కామెడీని పండించే నటుడిగా గుర్తింపు పొందారు దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తనయుడు ప్రముఖ నటుడు అల్లరి నరేష్. ఆయన నటించిన తాజా చిత్రం ఆల్కహాల్. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ మూవీ ఎందుకనో ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఆల్కహాల్ మూవీని బహుశా డిసెంబర్ నెలలో విడుదల చేయొచ్చని సమాచారం. వాస్తవానికి ఈ చిత్రం మొదట జనవరి 1న విడుదల కావాల్సి ఉంది. ఇప్పుడు డిసెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాదాపు 12 నెలల పాటు ఈ చిత్రం వాయిదా పడటం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతంలో చిత్ర బృందం దీనిని కొత్త సంవత్సర కానుకగా విడుదల చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ సుదీర్ఘ జాప్యంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మెహర్ తేజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆల్కహాల్’ ఒక క్రైమ్ థ్రిల్లర్. ఇందులో అల్లరి నరేష్ సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. రుహాని శర్మ, నిహారిక ఎన్.ఎమ్. కథానాయికలుగా నటిస్తుండగా సత్య, హర్షవర్ధన్, గిరీష్ కులకర్ణి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ – ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఆసక్తికరమైన కథాంశంతో , క్రైమ్ అంశాలతో ప్రేక్షకుల్లో కుతూహలాన్ని పెంచింది. ఇందులో అల్లరి నరేష్ మద్యంకు దూరంగా ఉండే ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు, కానీ అనుకోకుండా కొన్ని షాకింగ్ నేర ఘటనల్లో చిక్కుకుంటారు. సాధారణంగా కామెడీ పాత్రలతో గుర్తింపు పొందిన అల్లరి నరేష్ ఈ క్రైమ్ థ్రిల్లర్ ద్వారా భిన్నమైన కోణాన్ని ఆవిష్కరించ బోతున్నారు.
















