హైదరాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుని కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. ఈసందర్బంగా కవిత మాట్లాడారు. అనేక జిల్లాల నుంచి కొత్త పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. 2006లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మా కుటుంబంతో వారం రోజులు ఉండి హెల్త్ క్యాంపు పెట్టానని చెప్పారు. రాథోడ్ బాపూరావు ఉద్యోగాన్ని వదులుకుని తెలంగాణ ఉద్యమంలో పని చేశారని ప్రశంసించారు. రాథోడ్ బాపూరావు రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారని గుర్తు చేశారు. జాగృతి ద్వారానే రాథోడ్ బాపూరావు బిఆర్ఎస్ లో చేరారంటూ గుర్తు చేశారు కవిత. తెలంగాణలో ఉన్న ఉద్యమ కారులు కొత్త పార్టీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్త పార్టీకి ఆదరణ ఉంటుందన్నారు. ఉద్యమకారులు ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు కవిత.
ఏ స్పిరిట్ తో తెలంగాణ ఉద్యమంలో కలిసి పని చేశామో ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం పని చేయాలని అన్నారు. బూర్జువా పార్టీలను వదిలి కొత్త పార్టీలోకి రావాలని కోరుతున్నానని చెప్పారు కవిత. ఇదే వేదిక మీద సిరిసిల్ల నియోజకవర్గం నుంచి జాగృతిలో చేరుతున్న వారికి స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు.
బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మంచి రోజులు వస్తాయని ఉద్యోగానికి రాజీనామా చేసి నేను బోథ్ నియోజకవర్గంలో పని చేశానని అన్నారు. అడవుల జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో కవిత వారం రోజుల పాటు మెడికల్ క్యాంపు పెట్టారని తెలిపారు. కవిత ఇచ్చిన ధైర్యంతోనే నేను ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.
















