తిరుపతి : అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తొలి వాహనసేవ అయిన పెద్దశేష వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారు వైకుంఠనాథుడి అలంకారంలో పెద్దశేష వాహనంపై భక్తులకు దివ్య మంగళ దర్శనం ప్రసాదించి అనుగ్రహించారు. శ్రీ మహావిష్ణువుకు పరమ భక్తుడైన ఆదిశేషుడు తన పడగలతో స్వామివారికి ఛత్రంలా నీడనిస్తూ, పాన్పుగా సేవ చేస్తూ దాస్యభక్తికి ప్రతీకగా నిలుస్తాడు. త్రేతా యుగంలో లక్ష్మణుడిగా, ద్వాపర యుగంలో బలరాముడిగా శ్రీహరికి సేవలందించిన ఆదిశేషుడు, కలియుగంలో శ్రీవేంకటేశ్వర స్వామిని మోస్తూ భక్తులకు దర్శనం ఇవ్వడం విశేషం.
వాహనసేవకు ముందు హిందూ ధర్మప్రచార పరిషత్, ఎస్‌వీ సంగీత కళాశాల, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు కళాకారులు నిర్వహించిన భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.ఈ వాహనసేవలో టీటీడీ జేఈవో డా. ఎ. శరత్, కంకణ భట్టర్ సూర్యకుమార్ చార్యులు, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈవో దేవరాజులు, ఏవీఎస్వో రాధాకృష్ణ, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


















