హైదరాబాద్ : ప్రపంచ వారసత్వ వారోత్సవాల సందర్భంగా తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇబ్రహీం బాగ్ లోని కుతుబ్ షాహీ సమాధుల వద్ద ‘ప్రకృతి – వారసత్వం’ నడకను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సుమారు 50 మంది హాజరయ్యారు. ఈ నడకలో అక్కడి వాస్తుశిల్పం, జీవవైవిధ్యం , పక్షి జాతులను ప్రముఖంగా ప్రస్తావించారు. ఇదిలా ఉండగా తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ , వారసత్వ శాఖ, దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ , ఆగా ఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్‌ల సహకారంతో ఇబ్రహీం బాగ్ లోని కుతుబ్ షాహీ సమాధుల వద్ద ప్రదర్శన చేపట్టారు. వారసత్వ ఔత్సాహికులు, ప్రకృతి, పక్షి పరిశీలకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఆ ప్రాంగణంలోని స్మారక చిహ్నాలు, వాస్తుశిల్పం, జీవవైవిధ్యం మధ్య ఉన్న సంబంధాన్ని ప్రముఖంగా తెలియ జేసింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వారసత్వ శాఖ డైరెక్టర్ అర్జున్ రావు కుతాడి తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం , యువ తరాలలో వారసత్వ సంరక్షణపై అవగాహన పెంచడం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఆయన కుతుబ్ షాహీ సమాధులను పర్షియన్, దక్కనీ , భారతీయ వాస్తు నిర్మాణ సంప్రదాయాల సమ్మేళనంగా అభివర్ణించారు. పాల్గొన్నవారికి పక్షుల పిలుపులు ,శారీరక లక్షణాల ద్వారా వాటిని గుర్తించడం కూడా పరిచయం చేశారు. వారు మచ్చల గుడ్లగూబ, నల్ల డ్రోంగో, ప్లం-హెడెడ్ చిలుక, మచ్చల పావురం, నల్ల గద్ద, ఇండియన్ రాబిన్, గ్రీన్ బీ-ఈటర్, కింగ్‌ఫిషర్, ఆసియా కోయెల్, ఇండియన్ సిల్వర్‌బిల్, లిటిల్ స్విఫ్ట్‌తో సహా 40కి పైగా జాతుల గురించి చర్చించారు.
మూడవ ప్రకృతి నడక నవంబర్ 29న జరుగుతుందని తెలంగాణ పర్యాటక సంస్థ ప్రకటించింది. ఆసక్తి ఉన్నవారు మరిన్ని వివరాల కోసం నమోదు చేసుకోవడానికి 80192 49292 నంబర్‌ను సంప్రదించ వచ్చని తెలిపింది.
