సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికి చేర వేయాలి

కార్యవర్గ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

hellotelugu-UttamKumarReddy

హైద‌రాబాద్ : సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికి చేర వేయాల్సిన బాధ్య‌త పార్టీ శ్రేణుల‌పై ఉంద‌న్నారు రాష్ట్ర భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. హైద‌రాబాద్ లో జ‌రిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో పాల్గొని ప్ర‌సంగించారు. సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీకి పునాదులు అని స్ప‌ష్టం చేశారు. అంకితభావంతో పనిచేసే క్షేత్రస్థాయి కార్యకర్త కూడా కాంగ్రెస్‌లో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉందన్నారు. క్షేత్రస్థాయి కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించి, వారిని నాయకులుగా తీర్చిదిద్దడం కాంగ్రెస్ పార్టీ సంప్రదాయం అని స్ప‌ష్టం చేశారు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తోంద‌ని పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ, అర్హులైన లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేయడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం అని చెప్పారు.

తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి, ఇతర పంటల ఉత్పత్తి జ‌రిగింద‌న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు నేటికీ రైతులకు నీరందిస్తున్నాయని చెప్పారు. కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టులే వ్యవసాయానికి వెన్నెముకగా ఉన్నాయని అన్నారు. భారీ వ్యయం చేసినప్పటికీ, కాళేశ్వరం ప్రాజెక్టు ఆశించిన ప్రయోజనాలను అందించడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఉత్త‌మ్ కుమార్. కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరించి, ప్రజలకు ఉపయోగపడేలా చేయడం ప్రస్తుత ప్రభుత్వం బాధ్యత అని అన్నారు. ఇంకా వ్యయం అవసరం అవుతుంద‌న్నారు. ‘ఎల్ నినో’ (El Niño) ప్రభావం, నీటి లభ్యతపై ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు. బోరు బావులు, చెరువులపై ఆధారపడిన ప్రాంతాల్లో పంట సాగుకు నీటి కొరత ఏర్పడుతోంద‌ని అన్నారు. వచ్చే వర్షాకాలం వరకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం అని తెలిపారు కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నాం అని చెప్పారు. నీటి కొరత గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Exit mobile version