విజయవాడ : స్థానిక సంస్థల ఎన్నికలల్లో వైసీపీ నాయకులు ఓటమి భయంతో విధ్వంసాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఎమ్మెల్సీ వర్ల రామయ్య, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు విమర్శించారు. క్షేత్ర స్థాయిలో వైసీపీ పార్టీ ప్రజా బలం కోల్పోతుందనే కారణంగానే ఈ దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు. నంద్యాల, వైఎస్సాఆర్ కడప, గుంటూరు జిల్లాల్లో టీడీపీ నాయకులపై జరిగిన దాడులను ఖండించారు. నామినేషన్ వేయడానికి వెళ్తున్న టీడీపీ శ్రేణులను అడ్డగించి వారిపై దాడి చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశారు. ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం, వెనిగండ్ల గ్రామంలో వైసీపీ గూండాలు టీడీపీ మద్దతుదారులపై దాడి చేశారు. వైఎస్సార్సీపీ పార్టీకి చెందిన బాబులాల్, బ్రాందీన్ల నాయకత్వంలో సుమారు 50 మంది గుమిగూడి, టీడీపీ మద్దతుదారులపై రాళ్లు, రాడ్లతో విధ్వంసం సృష్టించారు.
ఈ దాడిలో చాగలమర్రి పట్టణ టీడీపీ అధ్యక్షుడు మౌలాలి, మరో నాయకుడు హనీఫ్ తీవ్రంగా గాయపడ్డారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బి.కొత్తపల్లి గ్రామంలో నామినేషన్ వేయడానికి వెళ్తున్న టీడీపీ మద్దతుదారులపై వైఎస్ఆర్సీపీ గూండాలు దాడి చేశారని ఆరోపించారు. ఈ దాడిలో టీడీపీ పార్టీకి చెందిన ముత్తూరు రఘురాం అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అలానే గుంటూరు జిల్లాలోనూ వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని తక్కెళ్లపాడు, వెనిగండ్ల గ్రామాల్లో, నామినేషన్ పత్రాల పరిశీలన సమయంలో అల్లరులు సృష్టించారు. పోలీసులపైనే భౌతిక దాడికి ప్రయత్నించారు. పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని అగతవరపాడు గ్రామంలో వైసీపీ పార్టీకి చెందిన కొందరు టీడీపీ అభ్యర్థులను బెదిరించి భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు సరైనవి కాదని.. క్షేత్రస్థాయిలో వైసీపీ పార్టీ ప్రజల మద్దతు కోల్పోతుందనే కారణంతో ఇలాంటి విధ్వంసాలకు వైసీపీ పాల్పడుతుందని మండిపడ్డారు. గాయపడిన టీడీపీ నాయకుల ఫోటోలను ఎస్ఈసీకి అందజేశారు. ప్రశాంతమైన వాతవారణంలో ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు ద్వారా విజ్ఞప్తి చేశారు.
