ఎడ్యుకేష‌న్ హబ్ ప‌నుల‌ను వేగ‌వంతం చేయాలి

స్ప‌ష్టం చేసిన ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి

teluguism-CM

వికారాబాద్ జిల్లా : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా
హకీంపేటలోని ‘ఎడ్యుకేషన్ హబ్’ పనులను ప‌రిశీలించారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ప‌నులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇకపై ప్రతి నెలా ఈ పనుల పురోగతిని తానే స్వయంగా సమీక్షిస్తానని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎడ్యుకేషన్ హబ్‌కు సంబంధించిన విద్యా సంస్థల భవన నిర్మాణాలను, ఆ ప్రాంత అభివృద్ధి ప్రణాళికలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎడ్యుకేషన్ హబ్‌లో భాగంగా నిర్మిస్తున్న ఇంజనీరింగ్, మెడికల్, నర్సింగ్, వెటర్నరీ కళాశాలలతో పాటు ఫిజియోథెరపీ, పారా మెడికల్ కళాశాలలు, సంబంధిత హాస్టళ్ల నిర్మాణ పనులను సీఎం తనిఖీ చేసి, పలు సూచనలు చేశారు.

నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంపై అసహనం వ్యక్తం చేశారు. ఎడ్యుకేషన్ హబ్‌లోని ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన నెలవారీ పురోగతిని సకాలంలో నివేదించాలని సూచించారు. ఇకపై పనుల పురోగతిని పర్యవేక్షించడమే కాకుండా, నెలకు ఒక రోజు నిర్మాణ స్థలంలోనే స్వయంగా గడుపుతానని ఆయన స్పష్టం చేశారు. పనుల విషయంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించే వారిని సస్పెండ్ చేయడానికి ఏమాత్రం వెనుకాడవద్దని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు.

భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్ల కేటాయింపులో జాప్యం జరుగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, రాబోయే వారం రోజుల్లోనే లబ్ధిదారులకు ప్లాట్ల పత్రాలను అందజేయాలని ఆదేశించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Exit mobile version