హైదరాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజక వర్గం లోని తుమ్మిళ్ళ లిఫ్ట్ కింద మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా భూ సేకరణ పూర్తి అయ్యి భూ నిర్వాసితులకు ఇవ్వాల్సిన నష్ట పరిహారం విషయం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్.ఎస్. ఏ సంపత్ కుమార్ , నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఇతర నేతలతో కలిసి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆదివారం మర్యాద పూర్వకంగా బాధిత రైతులతో కలిసి సీఎంను భేటీ అయ్యారు. ఈ సమస్యను మానవతా దృక్ఫథంతో పరిశీలించాలని కోరారు మాజీ ఎమ్మెల్యే, ఎంపీ.
ఇదిలా ఉండగా ఇంతకు ముందే ప్రభుత్వం ఎకరాకు రూ. 16, 50,000 ఇవ్వాలని నిర్ణయించిందని, ఈ డబ్బులు ఏ మాత్రం సరి పోవని సీఎంకు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్ ధర అంతకంటే ఎక్కువగా ఉందని వెల్లడించారు. తక్షణమే బాధిత రైతులకు మేలు చేకూర్చేలా ప్రకటించిన ధర కాకుండా మరింత గా నష్ట పరిహారం పెంచేలా చూడాలని , వారిని ఆదుకోవాలని కోరారు సంపత్ కుమార్, మల్లు రవి. మాజీ ఎమ్మెల్యే, ఎంపీ, ఇతర నేతలు కలిసి చేసిన విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందించచారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . భూమిని కోల్పోయే రైతులకు ఇబ్బంది లేకుండా తగిన నష్టపరిహారం అందేలా చూస్తామని అన్నారని ఈ సందర్భంగా వెల్లడించారు మాజీ ఎమ్మెల్యే, ఎంపీ.
ఈ చారిత్రాత్మక నిర్ణయం లో సంపత్ కుమార్ కీలకంగా వ్యవహరించి అలంపూర్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడం కొరకు చూపుతున్న శ్రద్ధను సీఎం ప్రశంసించారు.
