హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు లేక పోతే ఈ ప్రపంచం లేదన్నారు. ‘సేవా సంకల్ప అభియాన్’లో భాగంగా మల్లాపూర్‌లో నిర్వహించిన ‘అంగన్ మిలన్’ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రామచందర్ రావు ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పా రెడ్డి నిర్వహించారు. మహిళా సాధికారత ద్వారానే ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించ గలమని అధ్యక్షుడు స్పష్టం చేశారు. తన 25 ఏళ్ల ప్రజా జీవితంలో ప్రధాని నరేంద్ర మోదీ మహిళల సంక్షేమానికి, వారి హక్కుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజం పురోగమిస్తుందని చెప్పారు.
‘బేటీ బచావో, బేటీ పఢావో’ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు సమాజంలో గొప్ప మార్పులను తీసుకు వచ్చాయని ఆయన అన్నారు. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు , చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందించే కార్యక్రమాలను కూడా ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన తెలిపారు. తల్లులు , పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే బలమైన భారతదేశాన్ని నిర్మించగలమని రామచందర్ రావు అన్నారు. మోదీకి మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు కలగాలని ఆకాంక్షించిన ఆయన, ‘వికసిత్ భారత్’ లక్ష్యం దిశగా ప్రధాని దేశాన్ని నడిపించడం కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గిరివర్ధన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాడురి శ్రీనివాస్, మహిళా మోర్చా నాయకులు మరియు ఇతర పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
