శ్రీ సత్య సాయి జిల్లా : పట్టాదారు పాస్ బుక్ లపై రాజముద్ర వేసి రైతుల హక్కులు పరిరక్షించామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే జగన్ తీసుకొచ్చిన చీకటి చట్టం ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేశామన్నారు. ప్రచార యావతో పాస్ బుక్ లపైనా, సర్వే రాళ్లపైనా జగన్ రెడ్డి తన బొమ్మను వేసుకుని రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారన్నారు. కుంభకోణాలంటేనే జగన్ అని తీవ్రంగా మండిపడ్డారు. సోమందేపల్లి మండలం నాగినాయన చెరువు గ్రామంలో శుక్రవారం ఆంద్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్టు భూమి పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు.
రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్ తీసుకొచ్చిన చీకటి చట్టం ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల్లో హామీల్లో భాగంగా పట్టాదారు పాస్ బుక్ లపై జగన్ ఫొటో తొలగించి, రైతుల హక్కుల పరిరక్షణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రను ముద్రించి, నూతన పాస్ బుక్ లు అందజేస్తున్నామని చెప్పారు. పాస్ బుక్ లపై జగన్ ఫొటో ఉండడంతో రైతులు, భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఇపుడా ఇబ్బందులన్నీ తొలగి పోయాయన్నారు. జిల్లాలో 31,368 మంది రైతులకు నూతన పాస్ బుక్ లు అందజేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు.



















