అమరావతి : ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తే ప్రజలు కూడా అభివృద్ధిలో ఏ స్థాయిలో భాగస్వాములు అవుతారో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం చాటిచెప్పిందని ముఖ్యమంత్రి అన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి రెక్కలు వచ్చిన భావన ప్రజల్లో ఏర్పడిందన్నారు. ఉత్తరాంధ్రను అంతర్జాతీయ అవకాశాలకు గేట్‌వేగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు. దీన్ని ప్రజలు గ్రహించారు కాబట్టే ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి ప్రజల నుంచి చక్కటి మద్దతు లభించిందని అన్నారు. పీపీపీ పద్దతిలో ప్రాజెక్టులు చేపడుతుంటే వ్యతిరేకించిన వారు అదే పీపీపీ పద్దతిలో చేపట్టిన భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ క్రెడిట్ మాత్రం తమదని చెప్పుకుంటున్నారని సీఎం విమర్శించారు. పెట్టుబడులు వస్తే పరిశ్రమలు వస్తాయని.. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు, ఆదాయం పెరుగుతాయని పేర్కొన్నారు ఆదాయం పెరిగితే మరింత సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
2019–24 మధ్య రాష్ట్రాన్ని విషవలయంలోకి నెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. రోడ్లన్నీ గుంతలమయం అయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. గత ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయడంతోపాటు అభివృద్ధి వేగాన్ని నిలిపివేశారని అన్నారు. ఆదాయాలు తగ్గి.. ఖర్చులు పెరిగిన పరిస్థితుల్లో అప్పులు పెంచుకుంటూ వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి ఏర్పడిందని వివరించారు. 2019లో పరిపాలన ప్రారంభించిన తీరు ప్రజా వేదిక కూల్చివేతతోనే స్పష్టమైందని పేర్కొన్నారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ ప్రజా వేదికను కూల్చారని వాపోయారు. దీన్ని గర్వం అనాలా..? మదం అనాలా..? దీనికి పేరే లేదేమో..? అని సీఎం ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాలనలో విధానపరమైన నిర్ణయాల కంటే విధ్వంసకర చర్యలకే గత ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇచ్చిందని విమర్శించారు.
2019–24 మధ్య రాష్ట్రాన్ని అన్ని విధాలుగా వెనక్కి నెట్టారని సీఎం అన్నారు. మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో పురోగతి ఆగిపోయిందని, రోడ్ల నిర్వహణ సరిగాలేక గుంతలమయంగా మారాయని ఆరోపించారు. శాంతిభద్రతల పరిస్థితి దెబ్బతినడంతో పెట్టుబడిదారుల్లో నమ్మకం తగ్గిందన్నారు. పరిశ్రమలు రావాల్సిన చోట ఉన్నవి కూడా వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందని, కొత్త పెట్టుబడులు లేకుండా పోయాయని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత ప్రభుత్వం తీవ్రంగా దిగజార్చిందని చంద్రబాబు విమర్శించారు. నాటి ప్రభుత్వ నిర్వాకం వల్ల అప్పులు రూ.9.74 లక్షల కోట్లకు చేరాయని, అప్పులు తీర్చే సామర్థ్యం లేని రాష్ట్రంగా నీతి ఆయోగ్ పేర్కొనే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆదాయాలు తగ్గుతున్నా ఖర్చులు మాత్రం పెరిగాయని, ప్రభుత్వ ఆస్తులు, భూములను తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చారని ఆరోపించారు. రాష్ట్రం దివాళా తీసే స్థాయికి చేరడంతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
















