హైదరాబాద్ : దేశంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు రాజకీయ ప్రాధాన్యంలో వాటా లేకుండా పోయిందన్నారు బీసీ సంఘాల నేతలు. జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలకు రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్‌తో “56% బీసీలు.. రాజకీయ రంగంలో వాటా ఎక్కడ? అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, బీసీ ఇంటెలెక్టువల్స్ ఫోరం చైర్మన్ టి. చిరంజీవులు అధ్యక్షత వహించారు. ఎన్జీవోలు, సామాజిక ఉద్యమకారులు, మేధావులు, వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీజేపీ నాయకుడు తాడూరి శ్రీనివాస్ హాజరయ్యారు.
ప్రస్తుతం ఖాళీగా ఉన్న మూడు మంత్రి పదవులను తక్షణమే బీసీలకు కేటాయించాలని రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా డిమాండ్ చేసింది. అలాగే త్వరలో ఖాళీ కానున్న 5 ఎంఎల్సీ స్థానాలను బీసీ ల కు కేటాయించాలని నిర్ణయించింది.జనాభా ప్రాతిపదికన ప్రభుత్వంలో బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా సామాజిక న్యాయాన్ని అమలు చేయాలని కోరింది. ఇప్పటి వరకు తగిన ప్రాతినిధ్యం లభించని వడ్డెర, కుమ్మరి, నాయీ బ్రాహ్మణ వంటి బీసీ కులాలకు అవకాశం కల్పించడంతో పాటు మిగిలిన స్థానాలను కూడా బీసీలకే కేటాయించాలని సమావేశం విజ్ఞప్తి చేసింది.
సమావేశంలో బీసీల రాజకీయ ప్రాతినిధ్యంపై టి. చిరంజీవులు గణాంకాలతో కూడిన ప్రజెంటేషన్ ఇచ్చారు. గత రెండు దశాబ్దాల్లో బీసీల రాజకీయ ప్రాతినిధ్యం క్రమంగా తగ్గిపోతున్న పరిస్థితిని ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు బీసీలు మంత్రులుగా ఉండగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో ఆ సంఖ్య నలుగురికి, 2018లో ముగ్గురికి, ప్రస్తుతం 2026లో ఇద్దరికి తగ్గిందని ఆయన పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో బీసీల మంత్రివర్గ ప్రాతినిధ్యం ఒకటికి, చివరకు శూన్యానికి చేరే ప్రమాదం ఉందన్నారు. జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలు పరిపాలనలో మైనారిటీగా మారడం ప్రజాస్వామ్యానికి, సామాజిక న్యాయానికి విరుద్ధం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ తదితర జిల్లాల్లో బీసీల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గుతున్న తీరును కూడా గణాంకాలతో వివరించారు. శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలు రాజకీయ అధికారంలో మాత్రం మైనారిటీ స్థాయిలో ఉండటం బాధాకరమన్నారు. బీసీలకు న్యాయమైన వాటా లభించాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీలు ఐక్యంగా ఉంటేనే రాజకీయాధికారాన్ని సాధించగలరని అన్నారు. బీసీలంతా ఐక్యంగా తమ హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. జనగణనలో ప్రతి కులానికి యూనిక్ కోడ్ కేటాయించాల్సిన అవసరాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
బాలగోని బాలరాజుగౌడ్ మాట్లాడుతూ బీసీల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం కోసం జరుగుతున్న ఉద్యమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ, శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు “సామాజిక న్యాయం” గురించి మాట్లాడుతూనే మరోవైపు దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో అగ్రకులాలకు చెందిన వ్యక్తులను ముఖ్యమంత్రులుగా నియమించడం ద్వారా సామాజిక న్యాయం విషయంలో ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. జనాభాలో బీసీలు మెజారిటీగా ఉన్నప్పటికీ, రాజకీయ అధికారంలో వారికి తగిన వాటా దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెంచేందుకు అన్ని వర్గాల ప్రజాస్వామిక శక్తులు ఏకమై ఉద్యమించాల్సిన అవసరం ఉందని బాలరాజుగౌడ్ పిలుపునిచ్చారు.
బీజేపీ నాయకుడు తాడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీ కులాలను విభజించి, వారి ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలు తమ రాజకీయ శక్తిని గుర్తించి ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కటకం నరసింహారావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం మాదిరిగానే బీసీ హక్కుల కోసం కూడా ఉవ్వెత్తున ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. గుజ్జ సత్యం మాట్లాడుతూ రాబోయే కాలం బీసీలదేనని, బీసీ రాజ్యాధికారం సాధ్యమేనని అన్నారు. వట్టే జనార్దన్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో యాదవులపై వేధింపులు పెరుగుతున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న మూడు మంత్రి పదవుల్లో కనీసం ఒక పదవిని యాదవులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ విఠల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీలకు రాజకీయంగా తీవ్రమైన అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో కూడా బీసీలకు తగిన ప్రాతినిధ్యం లేదని, మున్నూరు కాపు సమాజానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించక పోవడం అన్యాయమని పేర్కొన్నారు. సమావేశంలో బీసీ నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి దాదాపు ఎనిమిది దశాబ్దాలు గడిచినా జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలకు అధికారంలో తగిన వాటా ఎందుకు లభించలేదని ప్రశ్నించారు.
