జాతీయ లోక్ అదాలత్‌లో 1.6 లక్షల కేసులు పరిష్కారం

ఇన్‌ఛార్జ్ సెషన్స్ జడ్జి ఎం.ఎస్.ఎం. అర్చన కుమారి

hellotelugu-LokAdalat

హైద‌రాబాద్ : ఇన్‌ఛార్జ్ సెషన్స్ జడ్జి ఎం.ఎస్.ఎం. అర్చన కుమారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హైదరాబాద్‌లో జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 1.6 లక్షల కేసులు పరిష్కారం చేసిన‌ట్లు వెల్ల‌డించారు. పరస్పర అంగీకారంతో వివిధ కేసులు పరిష్కరించ బడ్డాయని, దీనివల్ల పెద్ద సంఖ్యలో ఉన్న వాది-ప్రతివాదులకు త్వరితగతిన ఉపశమనం లభించిందని ఇన్‌ఛార్జ్ సెషన్స్ జడ్జి తెలిపారు. భారీ సంఖ్యలో కేసులు పరిష్కారం కావడం వల్ల, సుదీర్ఘ న్యాయపరమైన ప్రక్రియలను నివారించడంతో పాటు సమయం , న్యాయ పరమైన ఖర్చులు ఆదా అయ్యాయని ఆమె పేర్కొన్నారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించ బడిన కేసులకు సంబంధించిన తీర్పు పత్రాలు (అవార్డులు) సంబంధిత వ్యక్తులకు అంద జేసిన‌ట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ సెషన్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 1,60,107 కేసులు పరిష్కరించిన‌ట్లు వెల్ల‌డించారు.

వీటి ద్వారా రూ. 10.88 కోట్ల మొత్తం పరిష్కరించామ‌ని తెలిపారు రాజీ మార్గం ద్వారా పరిష్కరించు కోగలిగే పెండింగ్ కేసులను గుర్తించడానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు , అధికారులు కృషి చేశారని చెప్పారు, అలాగే పరస్పర అంగీకారంతో పరిష్కారాలను సులభతరం చేయడానికి సంబంధిత పక్షాలతో చర్చలు జరిపార‌ని పేర్కొన్నారు ఇన్ చార్జి సెష‌న్స్ జ‌డ్జి అర్చ‌న కుమారి. వివాదాలను సామరస్య పూర్వకంగా పరిష్కరించు కోవడానికి లోక్ అదాలత్‌లు అవకాశం కల్పిస్తాయని, తద్వారా ఇరు పక్షాలకు సమయం , న్యాయపరమైన ఖర్చులు ఆదా అవుతాయని అన్నారు. సమాజంలోని అర్హులైన పేద , బలహీన వర్గాలకు జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటున్న ప్రజలు సహాయం కోసం న్యాయ సేవా ప్రాధికార సంస్థను సంప్రదించాలని ఆమె కోరారు.

Exit mobile version