టికెట్ ఏదైనా యాప్ ఒక్కటే ప‌రిష్కారం

తీసుకు వ‌చ్చిన తెలంగాణ ప్ర‌భుత్వం

hellotelugu-MeeTicketAPP

హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఐటీ శాఖ పరిధిలో ఉన్న ‘మీ సేవ’ ద్వారా తెచ్చిన ‘మీ టికెట్’ యాప్ ఇప్పుడు ఎన్నో సర్వీసులను అరచేతిలో ఉన్న ఫోన్ ద్వారా పొందే సౌకర్యాన్ని కల్పిస్తోంది. బస్, మెట్రో ప్రయాణ టికెట్లు మొదలు టెంపుల్స్, పార్కులు, మ్యూజియం, ఫారెస్ట్ సఫారీ సందర్శన ఇలా చాలా రకాల సౌకర్యాలు, వాటి టికెట్లను అక్కడి క్యూ లైన్ తో సంబంధం లేకుండా ఈ యాప్ ద్వారా నేరుగా బుక్ చేసుకోవచ్చు.

ఒకవేళ ఎవరైనా ఎలక్ట్రిక్ కారులోప్రయాణిస్తే సమీపంలో ఉన్న ఛార్జింగ్ స్టేషన్ లొకేషన్ కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకునే వెసలుబాటు ఉంది. ఇలా ఇండోర్, అవుట్ డోర్ యాక్టివిటీస్ తో పాటు వివిధ సేవలను ఒకే యాప్ ద్వారా అందించటమే ‘మీ టికెట్’ యాప్ లక్ష్యం. ‘టికెట్ ఏదైనా యాప్ ఒక్కటే’ నినాదంతో ప్రవేశపెట్టిన ఈ యాప్ కొద్ది రోజుల్లోనే మంచి ప్రజాదరణ పొందుతోంది.

ఇప్పటికే సుమారు రెండున్నర లక్షల మంది ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఆరు లక్షలకు పైగా సేవలను పౌరులు బుక్ చేసుకున్నారు. నాలుగు కోట్ల రూపాయలకు పైగా విలువైన లావాదేవీలు సురక్షితంగా జరిగాయి. వివిధ ప్రభుత్వ శాఖలు నిర్వహించే 219 లొకేషన్లలో ‘మీ టికెట్’ యాప్ ద్వారా అక్కడి సేవలకు సంబంధించిన ప్రవేశ టికెట్లను నేరుగా యాప్ లోనే ప్రజలు పొందుతున్నారు.

త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని సేవలను ఈ యాప్ పరిధిలోకి తీసుకు వస్తామని, ఐటీ సేవలను పౌర సమాజం నిత్య జీవితంలో మరింతగా వాడుకునేలా విస్తరిస్తామని సమాచార, సాంకేతిక శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. సందర్శించే ప్రాంతం ఏదైనా, అక్కడిదాకా వెళ్లి క్యూలైన్ లో నిరీక్షించే బదులు ‘మీ టికెట్’ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని సులభంగా, సౌకర్యవంతంగా అక్కడి ఎంట్రీ టికెట్లను, సౌకర్యాలను బుక్ చేసుకోవచ్చని ‘మీ సేవ’ కమీషనర్ టి. రవి కిరణ్ వెల్లడించారు.

Exit mobile version