హైదరాబాద్ : హైదరాబాద్ నగరం నడిబొడ్డున చెరువుల ఆక్రమణలు తొలగించడం ,వాటిని పునరుద్ధరించడం సామాన్యమైన విషయం కాదని బిహార్‌కు చెందిన సిటీ మేనేజర్లు ప్రశంసించారు. నగరంలో సరస్సుల పరిరక్షణ, పునరుజ్జీవనం, పర్యావరణ పరిరక్షణ కోసం హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌సీఐ) హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఫర్ మేనేజింగ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌లో భాగంగా బిహార్ నుంచి వచ్చిన సిటీ మేనేజర్ల ( ఐఏఎస్ అధికారులు) బృందం నగరాన్ని సందర్శించింది. హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్న చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. కూకట్‌పల్లిలోని నల్ల చెరువు అక్రమణల తొలగింపు నుంచి చెరువు పునరుద్ధరణ ప్రస్తుత పరిస్థితి వరకూ చెరువుల అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్న విమోస్ టెక్నోక్రాట్స్ డైరెక్టర్ యూనస్ వివరించారు.
చుట్టూ వేల సంఖ్యలో నివాస ప్రాంతాలున్నాయి. మొత్తం కాంక్రీట్ జంగిల్‌గా ఉన్న ప్రాంతంలో వర్షం నీటికి నల్లచెరువు మార్గం చూపిందని హైడ్రా అధికారులు వివరించారు. చెరువుకు ఇన్లెట్లు, ఔట్లెట్లు అభివృద్ధి చేయడంతో వరద ముప్పు ఈ ప్రాంతానికి తొలగిందన్నారు. గత ఏడాదితో పోల్చితే భూగర్భ జలాలు కూడా బాగా పెరిగాయని స్థానికులు ఈ సందర్భంగా ఐఏఎస్ ల బృందానికి వివరించారు. చెరువు చుట్టూ ప్రయాణించి బండ్ నిర్మాణంతో పాటు అక్కడ పిల్లలు ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన ప్లే ఏరియాను తిలకించారు. సరస్సు పునరుజ్జీవన పనులు చేపట్టక ముందు ఉన్న పరిస్థితులు, అనంతరం చేపట్టిన చర్యలు, సరస్సు పరిధి పరిరక్షణ, పరిసరాల అభివృద్ధి, ఆక్రమణల నియంత్రణ, నీటి వనరుల రక్షణ తదితర అంశాలపై సిటీ మేనేజర్లకు వివరించారు.హైడ్రా చేపడుతున్న సరస్సుల పరిరక్షణ, పునరుజ్జీవన చర్యలను సిటీ మేనేజర్లు అభినందించారు. క్షేత్రస్థాయిలో సరస్సు చుట్టూ పర్యటించడం ద్వారా పట్టణ నీటి వనరుల పరిరక్షణలో ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కారానికి అనుసరిస్తున్న విధానాలపై తమకు ప్రత్యక్ష అవగాహన కలిగిందని తెలిపారు.
