ఘోరంగా ఓడించినా వైసీపీ నేత‌లు మార‌క పోతే ఎలా..?

నిప్పులు చెరిగిన కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్

hellotelugu-VasamShettySubhash

అమ‌రావ‌తి : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నిప్పులు చెరిగారు. ఆయ‌న జ‌గ‌న్ రెడ్డిని, ఆయ‌న పార్టీ వైసీపీని ఏకి పారేశారు. ఆదివారం రామ‌చంద్రాపురంలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై తోట త్రిమూర్తులు చేసిన వ్యాఖ్య‌ల‌పై ఘాటుగా స్పందించారు. తీవ్రంగా ఖండించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. వైసీపీ పాల‌నా కాలంలో అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేశార‌ని ఆరోపించారు. వాటిని చ‌క్క‌దిద్దేందుకు నానా తంటాలు ప‌డుతున్నామ‌న్నారు. ప్రజల తీర్పును జీర్ణించుకోలేక వైసీపీ నేతలు అబద్ధపు ప్రచారాలకు దిగుతున్నార‌ని మండిప‌డ్డారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవి అని కొట్టి పారేశారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం ఓటర్ల నమోదు, తొలగింపుల ప్రక్రియ మొత్తం భారత ఎన్నికల సంఘం పర్యవేక్షణలోనే జరుగుతుంద‌న్నారు. .

చంద్రబాబు నాయుడు పై ఆరోపణలు చేయడం ద్వారా వైసీపీ తమ రాజకీయ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవాలని చూస్తోందని ధ్వ‌జ‌మ‌త్తారు వాసంశెట్టి సుభాష్. ప్రజాస్వామ్యానికి కట్టుబడి పనిచేసిన నాయకుడు అని దేశం మొత్తం గుర్తించిందన్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ నేతలు ఇప్పుడు ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నార‌ని ఆరోపించారు. అమరావతి నిర్మాణం దోపిడీ కోసం కాదని, రాష్ట్ర భవిష్యత్తు కోసం అని ప్రజలు బాగా అర్థం చేసుకున్నారని అన్నారు. రైతులు స్వచ్ఛందంగా వేల ఎకరాల భూములను ఇచ్చి అమరావతికి మద్దతు తెలిపారని చెప్పారు. అమరావతి అనేది కేవలం రాజధాని మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవానికి ప్రతీక అని స్ప‌ష్టం చేశారు.

Exit mobile version