న్యూఢిల్లీ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి చెందిన కేబినెట్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడంపై స్పందించారు. ఏ పదవికన్నా యువత, విద్యార్థులే ముఖ్యం అన్నారు. మోదీ ప్రభుత్వం దేశ యువత మనోభావాలను గౌరవిస్తుందని స్పష్టం చేశారు. పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా అవసరమైన సంస్కరణలను అమలు చేయడానికి కట్టుబడి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. బీజేపీ కార్యకర్తలకు ఏ పదవికన్నా దేశం, మన యువత విద్యార్థులే చాలా ముఖ్యం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడం ఈ సూత్రానికి నిదర్శనం అని పేర్కొన్నారు అమిత్ షా. పేపర్ లీక్‌లకు బాధ్యులైన వారికి కఠిన శిక్ష పడేలా మోదీ తీసుకున్న నిర్ణయాలు అభినందనీయం అని అన్నారు. నీట్ పరీక్షలో విజయం సాధించిన విద్యార్థులకు ఈ చర్యలు పూర్తి న్యాయం చేకూరుస్తాయని నాకు పూర్తి నమ్మకం ఉందన్నారు.
విద్యాశాఖ మంత్రిగా ప్రధాన్ పదవీకాలాన్ని ప్రస్తావించారు. జాతీయ విద్యా విధానం , సమర్థవంతమైన అమలు, పీఎం శ్రీ పాఠశాలల విస్తరణ, డిజిటల్ విద్యను ప్రోత్సహించడం, నైపుణ్యాభివృద్ధి , పరిశ్రమ-విద్యాసంస్థల మధ్య బలమైన సమన్వయం వంటి కీలక సంస్కరణలను ఆయన ప్రవేశ పెట్టారని షా ప్రశంసలు కురిపించారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే ప్రధాన్ నిబద్ధతకు ఆయన పదవీకాలం అద్దం పట్టిందని అన్నారు. మరోవైపు, ప్రధాన్ రాజీనామాతో తన మనసు భారంగా ఉందని పశ్చిమ బెంగాల్‌కు చెందిన సువేందు అధికారి పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు తన రాజీనామాను సమర్పించడంతో నా హృదయం బరువెక్కింది. ప్రజా జీవితంలో తరచుగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది, కానీ దేశ నిర్మాణానికి ఆయన చేసిన సేవలు తరతరాల పాటు నిలిచి ఉంటాయని అన్నారు సీఎం.
జాతీయ విద్యా విధానం 2020 ద్వారా, ఆయన బలమైన ప్రాథమిక అక్షరాస్యతను పెంపొందించే, బహుళ-విషయ పరిజ్ఞానాన్ని ప్రోత్సహించే , ప్రపంచ వేదికపై ఆత్మవిశ్వాసంతో పోటీపడటానికి మన యువతకు అధునాతన నైపుణ్యాలను అందించే విద్యా వ్యవస్థకు పునాది వేశారని కొనియాడారు. ఆయన దృష్టి కేవలం విద్యను అందించడమే కాదు, ప్రతి యువ భారతీయుడిని భారత విలువలతో కూడిన ప్రపంచ పౌరుడిగా తీర్చిదిద్దడం అని పేర్కొన్నారు.
