సికింద్రాబాద్ : మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ఐడీఎల్ లో హానర్ హోమ్స్ పేరుతో ఒక్కో అపార్ట్మెంట్ 25 కోట్ల రూపాయలకు అమ్ముతున్నారని ఆరోపించారు 300 ఎకరాలు కేసీఆర్ వారికి ఇచ్చారని , తాము అధికారంలోకి వస్తె వెనక్కి తీసుకుంటాం అన్న రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకోవడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఎంపీ. పాత కేటాయింపులన్నిటిపై విచారణ జరుపుతా అన్న సీఎం హానర్ హోమ్స్ మీద ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నించారు. ఎందుకు విచారణ చెప్పటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదో చెప్పాల్సిన బాధ్యత నీపై ఉందన్నారు.
22A తీసుకొచ్చి 10 లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వానికి డబ్బులు వచ్చేలా చేయాలని, స్వామి కార్యం స్వకార్యం లా ఒక 30 శాతం కొట్టేయాలని చూస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఈటల రాజేందర్. వీటన్నిటిని తెలంగాణ ప్రజానీకం గమనిస్తున్నారని అన్నారు. అర్బన్ సీలింగ్ ల్యాండ్ లను ప్రైవేటు వారికి కట్టబెట్టే ప్రయత్నం కూడా ఆపాలని డిమాండ్ చేశారు.పేదవాడు పేదవాడిలానే ఉంటున్నాడు, పెద్దవాడు ఒకటే తరంలో పదిరెట్ల ఆస్తులకు ఎలా పెరుగుతున్నారంటూ ప్రశ్నించారు.ఈ సమాజం ఎటు పోతుందో. ఓట్లు వేసి కూర్చోబెట్టిన కర్మానికి మా ఉసురు పోసుకుంటున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అయినా వారి గోస సీఎంకు పట్టడం లేదన్నారు.
నిజాం కాలంలో 1908లో వరదలు వచ్చినప్పుడు అనేక ఇళ్లు వరదల్లో కొట్టు పోయాయి. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు 1911 లో నిజాం ఏర్పాటు చేసి ప్రజలకు ఇల్లు కట్టించారు. 1931 లో “సికింద్రాబాద్ ఇంప్రూవ్మెంట్ బోర్డ్” ఏర్పాటు చేశారు. ఈ బోర్డ్ 1960లో హౌసింగ్ బోర్డ్ గా మారింది. ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వ భూములు కేటాయించడంతో పాటు రైతుల భూములు కూడా సేకరించారు. కూకట్పల్లి, కైతలాపూర్, హైదర్ నగర్ మూడు గ్రామాల పరిధిలో 1400 ఎకరాలు సేకరించారు. హౌసింగ్ బోర్డ్ ఉద్యోగులకు గజం 1 రూపాయి 25 పైసలకు ఇచ్చారు.ఆర్థిక స్తోమతను బట్టి కొనుక్కొనే విధంగా 66 గజాలు, 111 గజాలు, 311 గజాలు, 400 గజాలు ప్లాటింగ్ చేశారు. JNTU కోసం హౌసింగ్ బోర్డ్ 100 ఎకరాలు లీజుకు ఇచ్చారు .హౌసింగ్ బోర్డ్ ఏర్పడింది పేదవారి సొంత ఇంటి కలను నెరవేర్చడానికి తప్ప వ్యాపారం చేయడానికి కాదన్నారు.
