ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తాం

స్ప‌ష్టం చేసిన ర‌వాణా శాఖ మంత్రి పొన్నం

hellotelugu-PonnamPrabhakar

హైద‌రాబాద్ : ఇటీవల జరిగిన ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో విజయం సాధించిన ఐక్య కూటమి నాయకులు ఈయూ , టీఎంయూ , ఎన్ఎంయూ ప్రతినిధులు మినిస్టర్ క్వార్టర్స్‌లో రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయం సాధించిన కార్మిక సంఘాల నాయకులను అభినందించారు. నేత‌న‌లు ఘ‌నంగా స‌న్మానించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి స్థాయిలో ఎన్నికలు జరగడం ఎంతో ముఖ్యం అన్నారు. కార్మిక సంఘాల ఎన్నికల మాదిరిగానే విద్యార్థి సంఘాల ఎన్నికలు కూడా ప్రజాస్వామ్యానికి ఎంతో కీలక‌మ‌ని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు, వారి హక్కులను కాపాడేందుకు ప్రజాస్వామ్య బద్ధమైన నాయకత్వం ఏర్పడాలని అభిప్రాయ‌ప‌డ్డారు పొన్నం ప్ర‌భాక‌ర్. తాను కూడా విద్యార్థి సంఘాల ఎన్నికల ద్వారానే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యలను తొందరపాటు నిర్ణయాలతో కాకుండా, నిర్మాణాత్మకంగా పరిష్కరించేందుకు త‌మ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించిన అంశాలపై అధికారులు, కార్మిక సంఘాల నాయకులు సమన్వయంతో చర్చించి, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కార్యాచరణ రూపొందించాలని స్ప‌ష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న సమస్యలతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను ముందుగానే గుర్తించి పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ విలీన ప్రక్రియలో ఎదురైన సమస్యలు తెలంగాణలో పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. కార్మికుల ప్రయోజనాలను కాపాడుతూనే సంస్థ అభివృద్ధికి దోహదపడేలా నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నారు పొన్నం ప్ర‌భాక‌ర్.

ఆర్టీసీలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా, వారికి రావాల్సిన ప్రయోజనాలను అందించాల్సిన బాధ్యత త‌మపై ఉంద‌న్నారు. అవసరమైతే సంస్థకు చెందిన విలువైన భూములను విక్రయించైనా రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను తీర్చేందుకు చర్యలు తీసుకుంటాం అన్నారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లానని చెప్పారు. ఉద్యోగుల సీసీఎస్‌ బకాయిలతో పాటు ఇతర పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకు పోయిన సీసీఎస్ బకాయిలను చెల్లించే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటోందన్నారు. సీసీఎస్ పాత బకాయిలకు సంబంధించి ఇటీవల కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో చట్టపరమైన బాధ్యతలకు అనుగుణంగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.

Exit mobile version