నాపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టారు : అభిజిత్ దిప్కే

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ

hellotelugu-AbhijitDipke

న్యూఢిల్లీ : ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తనపై ఇంటెలిజెన్స్ బ్యూరో నిఘా ఉంచిందని బాంబు పేల్చారు. ‘తిరంగా మార్చ్’కు ముందు తనను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఈ తిరంగా మార్చ్‌ను చేపట్టింది. ఈ సంద‌ర్భంగా అభిజీత్ దిప్కే మాట్లాడుతూ నంబర్ ప్లేట్లు లేని వాహనాలు తనను అనుసరిస్తున్నాయని వాపోయారు. తన నివాసం వద్ద ఉన్న వాచ్‌మెన్ దగ్గర ఇంటెలిజెన్స్ బ్యూరో సిబ్బంది సమాచారం అడిగి తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. తనను పోలీసులు అదుపులోకి తీసుకోవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. జాతీయ జెండాను ఎగుర వేసినందుకు జైలుకు వెళ్లడానికి తాను సిద్ధమని చెప్పిన ఆయన, దీనిని నేరంగా ఎలా పరిగణిస్తారో వివరించాలని అధికారులను ప్రశ్నించారు.

తాము శాంతియుతంగా వెళ్లి తిరంగాను ఎగుర వేస్తాం. ఈ దేశ పౌరులుగా దీన్ని మీరు నేరంగా భావిస్తే, మీరే అతిపెద్ద దేశద్రోహులు అని స్ప‌ష్టం చేశారు అభిజిత్ దిప్కే. కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌లో జాతీయ జెండాను ఎగుర వేయాలని సీజేపీ తన మద్దతుదారులను, ప్రజలను కోరింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈ మార్చ్ నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ఢిల్లీ హైకోర్టు నేటి సీజేపీ నిరసనను అడ్డుకోవడానికి నిరాకరించింది. మరోవైపు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఒక ప్రకటన చేస్తూ శుక్ర‌, శ‌నివారాల‌లో సెంట్ర‌ల్ పార్కును మూసి వేస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని ప్రశ్నించారు దిప్కే. ఒక‌వేళ‌ తమ పార్టీ ఇలాంటి జెండా ప్రదర్శన కార్యక్రమాలను పలు చోట్ల నిర్వహిస్తే, అధికారులు అన్ని ప్రాంతాలను మూసివేస్తారా అని నిలదీశారు. ఒక రాజకీయ సభ జరుగుతున్న చోట ప్రజలు జాతీయ జెండాను ఊపాలని నిర్ణయించుకుంటే, ఆ సభను రద్దు చేస్తారా అని కూడా ఆయన నిల‌దీశారు.

Exit mobile version