హైదరాబాద్ : అకాల వర్షాలతో వివిధ జిల్లాల్లో పంటలు, పంట ఉత్పత్తులకు నష్టం వాటిల్లిందని, వెంటనే ఆయా జిల్లాల ఇంచార్జి మంత్రులు బాధ్యత తీసుకుని వివరాలు తెప్పించుకుని రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. హిల్ట్ పాలసీలో దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. భూముల ధరలు పెరిగే లోపు దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా పది శాతం చెల్లించే వెసులుబాటు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. వారికి ఇప్పుడున్న భూముల ధరలే వర్తిస్తాయి. మిగతా 90 శాతం 90 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది.
నల్గొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డుకు అప్పగించే ఎంవోయూకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో నల్గొండ- రంగారెడ్డి మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ ( NARMAC) కు సంబంధించిన పాలు, పాల ఉత్పత్తులకు సంబంధించి డైరీ ప్లాంట్ నిర్వహణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ ఎన్డీడీబీ నిర్వహిస్తుంది .తెలంగాణలో 9 జిల్లాల్లో 33/11 కేవీ సబ్స్టేషన్ల వద్ద సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. పైలెట్ పద్ధతిన 18 చోట్ల ఈ సోలార్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. దాదాపు రూ.66.50 కోట్లతో 19 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది.
క్యూర్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లలో పెండింగ్ లో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలు పన్నులను క్లియర్ చేరుకునేందుకు వన్ టైమ్ సెటిల్ మెంట్ ( OTS) వెసులుబాటు కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు రూ. 5864 కోట్ల బకాయిలున్నాయి. జరిమానాలు, వడ్డీలన్నీ మినహాయించి వన్ టైమ్ సెటిల్మెంట్ ద్వారా రూ.1686 కోట్లు వస్తాయని అంచనా వేసింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలోనే వన్ టైమ్ సెటిల్మెంట్ పై ఈ బకాయిలు వసూలు చేసుకోవాలని మున్సిపల్ శాఖను ఆదేశించింది. హైదరాబాద్ జల మండలికి ఇవ్వాల్సిన నీటి బకాయిలను కూడా సర్దుబాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
