హైదరాబాద్ : ప్రభుత్వ భూమిలో అంగుళం కూడా ఆక్రమణకు గురికాకుండా కాపాడతామని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల ఆక్రమణల పట్ల కఠిన వైఖరి అవలంబిస్తామని, ప్రజా ఆస్తుల పరిరక్షణను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారనని తెలిపారు. మియాపూర్ భూ వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడం, గచ్చిబౌలిలో 400 ఎకరాల విలువైన భూమికి సంబంధించి సుప్రీంకోర్టులో ప్రభుత్వం విజయం సాధించడం వంటి పరిణామాలు దీనికి నిదర్శనం అన్నారు. ఐఎమ్జికి సంబంధించిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిందని చెప్పారు. సీఎం నాయకత్వంలోని ప్రభుత్వం ప్రభుత్వ భూములను, ప్రజా ఆస్తులను కాపాడే విషయంలో ఎటువంటి రాజీ పడదని పేర్కొన్నారు. భూ ఆక్రమణలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న విలువైన ప్రభుత్వ భూ వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం బలమైన న్యాయ పోరాటాలు చేస్తోందని ఆయన చెప్పారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వ భూముల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. రెవెన్యూ శాఖ, న్యాయ శాఖ, ప్రభుత్వ న్యాయవాదులు , న్యాయ నిపుణుల మధ్య సమన్వయాన్ని మెరుగు పరిచి సుప్రీంకోర్టుతో సహా వివిధ కోర్టులలో ప్రభుత్వం తన వాదనలను సమర్థవంతంగా వినిపిస్తోందని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు పాత రికార్డులు, రెవెన్యూ పత్రాలు , న్యాయపరమైన అంశాలను ప్రభుత్వం సమగ్రంగా సమీక్షిస్తోందని పొంగులేటి పేర్కొన్నారు. మియాపూర్ భూ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రావడం ఒక ముఖ్యమైన విజయమని, అలాగే గచ్చిబౌలిలో 400 ఎకరాల విలువైన భూమికి సంబంధించి సుదీర్ఘ న్యాయ పోరాటంలో విజయం సాధించడం ద్వారా ప్రభుత్వ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు, వాటిని కాపాడేందుకు ప్రభుత్వం ఎంత దృఢంగా ఉందో స్పష్టమైందని ఆయన అన్నారు.
గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమికి సంబంధించిన వివాదం 2003 నుండి పెండింగ్లో ఉందని ఆయన గుర్తు చేశారు. 2024 మార్చి 7న తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, ఆ తర్వాత 2024 మే 3న సుప్రీంకోర్టులో ఐఎమ్జి సంస్థ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసిందని ఆయన తెలిపారు. అదే ప్రాంతంలో అటవీ , పర్యావరణ పరిరక్షణకు సంబంధించి 2025లో సుప్రీంకోర్టు చేపట్టిన ‘సుమోటో’ విచారణకు ఐఎమ్జి భూ యాజమాన్య వివాదానికి ఎటువంటి సంబంధం లేదని, ఇవి రెండూ వేర్వేరు అంశాలని మంత్రి స్పష్టం చేశారు.
