ఢిల్లీ : తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు మాజీ సీఎం కేసీఆర్ పై. మియాపూర్ భూములు కొల్లగొట్టేందుకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఆయన బంధువు దామోదర్ రావు, గోల్డ్ స్టోన్ ప్రసాద్ ద్వారా ప్రయత్నించారని ఆరోపించారు. శుక్రవారం ఢిల్లీలో సీఎం మీడియాతో మాట్లాడారు. మియాపూర్ లో రూ. 50 వేల కోట్ల విలువైన భూముల ప్రభుత్వానికి చెందుతాయని సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిందన్నారు. ఈ సందర్బంగా సుప్రీంకోర్టు కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు సీఎం. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని విలువైన భూములు కబ్జాకు ప్రయత్నించారని ఆరోపించారు.
ఎమ్మెల్యేగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షునిగా ఈ కబ్జా వ్యవహారాలపై పోరాడడంతోనే కక్ష గట్టి నన్ను జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు.
మియాపూర్ భూముల విషయంలో దామోదర్ రావుకు ముందుగానే విలాసవంతమైన కార్లు లంచంగా ఇచ్చారని బాంబు పేల్చారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కు నగదు రూపంలో ముడుపులు ఇచ్చారని పేర్కొన్నారు. తాము ఈ భూముల రక్షణకు ప్రభుత్వo తరఫున బలమైన వాదనలు వినిపించాం అని తెలిపారు. తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో ఆ భూముల రక్షణకు సరైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల కబ్జాల నుంచి భూములను రక్షించే ప్రయత్నిస్తున్నాం అని చెప్పారు సీఎం. ఈ విలువైన భూములను విక్రయించి నీటిపారుదల, విద్యా, వైద్య తదితర రంగాలకు కేటాయిస్తాం అని ప్రకటించారు. తమ ప్రభుత్వం వచ్చాక రూ. 1.50 లక్షల కోట్ల విలువైన భూములు రక్షించాం అన్నారు. ఐఎంజీ భూములను భలేరావు కుటుంబ సభ్యులతో కుమ్మక్కై కేటీఆర్ కొట్టేయాలని చూస్తే న్యాయపోరాటంతో అడ్డుకున్నామని తెలిపారు.
కంచె గచ్చిబౌలి, మామిడిపల్లి భూములను కొట్టేసేందుకు బీఆర్ ఎస్ నాయకులు ప్రయత్నిస్తే న్యాయ పోరాటంలో గెలిచాం అన్నారు.గుర్రంగూడ అటవీ భూములను కేటీఆర్ అనుచరులు కబ్జాకు ప్రయత్నిస్తే సుప్రీం కోర్టులో పోరాడాం అని తెలిపారు. ప్రభుత్వం పోరాటంతో ఆది అటవీ భూమి అని సుప్రీం కోర్టు తెల్చి చెప్పిందన్నారు. మంచిరేవుల లో 143 ఎకరాల భూమిని కేటీఆర్ రాయలసీమ బిల్డర్స్ తో కలిసి కబ్జాకు ప్రయత్నిస్తే దానిని రక్షించామని పేర్కొన్నారు. అందులో పోలీసుల పిల్లలకోసం స్కూల్ పెట్టాం అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 400 ఎకరాల అటవీ భూమిని బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యే కు నజరానాగా అప్పగిస్తే సుప్రీం కోర్టులో పోరాడి రక్షించాం అని చెప్పారు. పద్మాలయ స్టూడియో, ల్యాంకో భూములపై ఉమ్మడి రాష్ట్రంలో కేసులు వేసిన కేసీఆర్, హరీష్ రావు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు వాటిని స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి పై కేసులు వేశారో వారితో కేసీఆర్, హరీశ్ రావు లాలూచీ పడ్డారని ఆరోపించారు.
