రైత‌న్న‌ల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన అర్న‌బ్ తుపాను

ఆవేద‌న వ్య‌క్తం చేసిన ఏపీపీసీసీ చీఫ్ ష‌ర్మిలా రెడ్డి

hellotelugu-YSSharmilaReddy

అమ‌రావ‌తి : అర్న‌బ్ తుపాను రైతులను ఆగ‌మాగం చేసింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. అన్నదాతకు అర్నబ్ మిగిల్చింది ఆత్మఘోష త‌ప్ప మిగిలింది ఏమీ లేద‌న్నారు. ఆరుగాలం పడ్డ కష్టానికి దక్కిన ఫలితం అపారనష్టం. రెక్కలు ముక్కలు చేసుకొని పంట పండిస్తే, చేతికొచ్చే దశలో తుపాను పాలై, రైతన్నలు కన్నీరు మున్నీరు అవుతుంటే గుండె తరుక్కు పోతుందని పేర్కొన్నారు. అర్నబ్ తుఫాను రైతన్నల ఆశలను మట్టిలో కలిపిందని ఆవేద‌న చెందారు .తుఫాన్ ధాటికి జరిగింది కొండంత నష్టమైతే, ప్రభుత్వం చూపెడుతుంది గోరంత మాత్రమేన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జరిగిన నష్టంపై క్షేత్రస్థాయి వాస్తవాలు ఒకటైతే.. ముఖ్యమంత్రి కాగితాల మీద చెప్తున్న లెక్కలు మరొకటిగా ఉన్నాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు ష‌ర్మిలా రెడ్డి.

తుఫాన్ ప్రభావిత జిల్లాలో అన్ని పంటలు కలుపుకుంటే ప్రాథమికంగా జరిగిన నష్టం 15 లక్షల ఎకరాలకు పైనే. ఇందులో వరిపంటను జరిగిన నష్టం అత్యధికంగా 10 లక్షల ఎకరాలు. 100 శాతం పంటలు నష్టపోయిన రైతుల సంఖ్య సుమారు 7 లక్షల పైమాటే. పంటలు, రోడ్లు, ఇతర మౌలిక రంగాలు అన్ని కలుపుకొని దాదాపు అర్నబ్ మిగిల్చిన నష్టం సుమారు 15 వేల కోట్లు. కానీ ప్రభుత్వం చెప్తున్న నష్ట అంచనా కేవలం రూ. 4600 కోట్లు మాత్ర‌మేన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆర్భాటంలో అగ్రస్థానం.. రైతులను ఆదుకోవడంలో చివరిస్థానం.. ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు. తుఫాన్ల కారణంగా నష్టపోయిన రైతులకు జరుగుతున్నది ప్రతిసారి మోసమేన‌ని వాపోయారు. కేంద్ర బృందాలని, నష్టనివారణ చర్యలని, ప్రభుత్వ పరిహారమని హడావిడి తప్పా, ఆచరణ మాత్రం శూన్యం అన్నారు. గత మొంథా తుఫాన్ మిగిల్చిన నష్టాన్ని ఇంకా ఇవ్వలేదంటే కూటమి ప్రభుత్వానికి రైతు సంక్షేమంపై చిత్తశుద్ధి ఏపాటిదో తెలుస్తుందన్నారు.

Exit mobile version