హైదరాబాద్ : లేక్ సిటీగా పేరుగాంచిన హైదరాబాద్‌లో మరో చారిత్రక చెరువును పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు హైడ్రా రంగంలోకి దిగింది. జీడిమెట్లలోని ఫాక్స్ సాగర్ చెరువును మినిట్యాంక్ బండ్‌గా తీర్చిదిద్దాలని హైడ్రా అడుగులు వేస్తోంది. 129 ఏళ్ల చరిత్ర ఉన్నఈ చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ చెరువు పునరుద్ధరణ పనులు ప్రారంభించ నున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఫాక్స్ సాగర్‌ను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ (అసఫ్ జా VI) హయాంలో 1897లో నిర్మించిన చారిత్రక ఫాక్స్ సాగర్ చెరువు ఉత్తర హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు వ్యవసాయానికి ప్రధాన ఆధారంగా నిలిచేదని అన్నారు. అయితే ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ చెరువు కాలుష్య జలాలతో నిండి పోవడమే కాకుండా కబ్జాలకు గురైందని హైడ్రా కమిషనర్ చెప్పారు. దాదాపు 490 ఎకరాల ఈ చెరువు పరిధి ఉండగా 150 ఎకరాల మేర ఆక్రమణలకు గురైనట్టు తెలుస్తోందని.. కబ్జాలను తొలగిస్తామన్నారు. ఎల్‌నినో ప్రభావం ఉన్న సమయంలో ఈ నీటిని వినియోగించుకోలేని దుస్థితిలోకి చెరువు నెట్టబడిందని.. మళ్లీ జీవకళ తీసుకు రావడమే హైడ్రా లక్ష్యమని చెప్పారు.
జీడిమెట్లలోని ఫాక్స్ సాగర్ ను మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నిర్దేశించారని.. ఏడాదిలో ఈ చెరువు పనులు పూర్తి చేస్తామని హైడ్రా కమిషనర్ తెలిపారు. సుమారు 150 ఎకరాల మేర ఆక్రమణలు జరిగినట్లు అంచనా వేస్తున్నామని.. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో కలిసి ఆక్రమణలను తొలగించి చెరువును అభివృద్ధి చేస్తామన్నారు. ఎవరివైనా పట్టా భూములుంటే.. చట్ట ప్రకారం వారికి టీడీఆర్ వస్తుందని తెలిపారు. దాదాపు 47 కిలోమీటర్ల నుంచి ఈ చెరువుకు వరద నీరు వచ్చి చేరేదని.. 2000 సంవత్సరంలో కట్ట కొట్టుకు పోవాల్సినంత వరద వచ్చి చేరిందని అన్నారు. అందుకే ఈ చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే చాలా వరకూ తాగునీటి సమస్యలు కూడా పరిష్కారమౌతాయన్నారు. చెరువు సహజ లక్షణాలన్నీ మళ్లీ సమకూరుస్తామని.. ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లను అభివృద్ధి చేస్తామన్నారు. దాదాపు 10 అడుగుల మేర పారిశ్రామిక వ్యర్థాలు, పూడిక చేరిందని.. పూర్తి స్థాయిలో తొలగించి చెరువులో మంచి నీరు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. మురుగు, పారిశ్రామిక వ్యర్థాలు చెరువులో కలవకుండా.. కాలువలను డైవర్ట్ చేయడంతో పాటు.. వేసవిలో కూడా నీరు పుష్కలంగా ఉండేలా ఎస్‌టీపీ(సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్)లను పెట్టి వాటి ద్వారా నీరు చేరేలా చర్యలు చేపడతామన్నారు కమిషనర్. తొలిదశ పనులను రూ. 75 కోట్లతో చేపడుతున్నట్టు తెలిపారు.
